Telanagana Pearl Farming : ముత్యాల సాగుతో లక్షల్లో ఆదాయం.. తెలంగాణ రైతులకు కొత్త ‘గోల్డ్ మైన్’ అవుతుందా?
Telanagana Pearl Farming : తెలంగాణలో ముత్యాల సాగు పంటలకు ఫుల్ క్రేజ్ పెరుగుతోంది. యువ రైతులు ఈ ముత్యాల సాగుతో లక్షల్లో సంపాదిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
- Sreehari A
- Updated on- July 27, 2026 / 04:21 PM IST
Telanagana Pearl Farming
Telanagana Pearl Farming : వ్యవసాయం ట్రెండ్ మారింది.. రైతుల సంపాదన కూడా క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త సాగు పంటలతో యువ రైతులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ముత్యాల సాగు ఇప్పుడు తెలంగాణ రైతులకు వరంగా మారింది.
పట్టిన చోట బంగారం అన్నట్టు.. సాగు చేసిన చోట బంగారంలా ముత్యాలు మెరిసిపోతున్నాయి. ఇందులో ఎక్కువగా యువ రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా కొత్త యువ రైతులు ఇప్పుడు వ్యవసాయంలో ముత్యాల సాగు (పెరల్ ఫార్మింగ్) వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటివరకు మహారాష్ట్ర, ఒడిశా, బిహార్, బెంగాల్ వంటి రాష్ట్రాలకే పరిమితమైన ఈ ముత్యాల సాగు.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరిస్తోంది. తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ అధిక ఆదాయాన్ని పొందవచ్చు. దాంతో యువ రైతులు ఎక్కువగా ముత్యాల సాగునే ఎంచుకుంటున్నారు.
గుంట స్థలం.. ఏడాదిలో డబుల్ ప్రాఫిట్ :
ఒక గుంట స్థలంలో 6 అడుగల నుంచి 8 అడుగుల లోతుతో పాండ్ ఏర్పాటు చేసుకుంటే చాలు.. ఆసక్తిగల రైతులు ఎవరైనా ముత్యాల సాగు మొదలుపెట్టొచ్చు. కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో సుమారు 10 వేల ఆల్చిప్పలను సాగు చేయొచ్చు. ఏడాది తర్వాత కంపెనీలు బైబ్యాక్ డీల్ ప్రకారం ముత్యాలను కొనేందుకు వస్తాయి. ఒక్కో ఆల్చిప్పలో 2 ముత్యాలు ఉంటాయి. అన్నీ ఖర్చులు పోను రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు లాభం పక్కా ఉంటుందని సాగు రైతులు అంటున్నారు.
Read Also : Anti-Paper Leak Law : పేపర్ లీక్‌లపై కేంద్రం కొత్త బిల్లు.. 10 ఏళ్ల జైలు.. రూ.10 కోట్ల జరిమానా..!
ట్రైనింగ్, సబ్సిడీ పొందొచ్చు :
ముత్యాల సాగును కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ద్వారా సాగురైతులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (NFDB) ట్రైనింగ్ కూడా ఇస్తోంది.
అలాగే, పెద్ద యూనిట్లకు 35 శాతం వరకు సబ్సిడీని అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు ఆల్చిప్పలు సరఫరా చేస్తున్నాయి. రైతులతో బైబ్యాక్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నాయి. అంతేకాదు.. మార్కెటింగ్ బాధ్యతను కూడా తమ భుజాలపై వేసుకుంటున్నాయి.
లాభాలే కాదు.. రిస్క్ కూడా :
ముత్యాల సాగుకు నీటి నాణ్యత చాలా ముఖ్యం. పీహెచ్ 6–8, టీడీఎస్ 150 నుంచి 350 మధ్య ఉండాలి. అలాగే నీళ్లను తరచూ మారుస్తూ ఉండాలి. చనిపోయిన ఆల్చిప్పలను వెంటనే తొలగించాలి. 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత తప్పనిసరి. సరైన ట్రైనింగ్ లేకుండా ఈ సాగుచేపడితే నష్టాలే ఎక్కువని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
మహారాష్ట్ర సిరొంచకు చెందిన రవి బొంగోనివార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు ఠాకూర్ పవన్‌సింగ్ వంటి యువ గ్రాడ్యుయేట్లు కూడా ముత్యాల సాగుతో భారీగా ఆదాయం పొందుతున్నారు. దాంతో మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, జనగామ జిల్లాలకు చెందిన రైతులు కూడా ఆసక్తితో ఈ పెరల్ రంగంలోకి దిగుతున్నారు.
ముత్యాల సాగుకు ఫుల్ డిమాండ్? :
ముత్యాలు అనేవి ఆభరణాలే కాదు.. ఆయుర్వేద మందుల్లోనూ వాడుతారు. కాల్షియం సప్లిమెంట్లు, కాస్మొటిక్స్, ఇంటీరియర్ డెకరేషన్ ఇలా పలు రంగాల్లో వాడుతుంటారు. దేశీయంగా ఉత్పత్తికి డిమాండ్ లేక భారత్ విదేశాల నుంచి భారీగా ముత్యాలను దిగుమతి చేస్తోంది. ఇకపై అలా కాకుండా, సరైన ట్రైనింగ్‌తో ముత్యాల సాగు చేపడితే రైతులకు భవిష్యత్తులో అత్యంత లాభదాయకమైన వ్యవసాయంగా మారనుంది.
