Anti-Paper Leak Law : పేపర్ లీక్‌లపై కేంద్రం కొత్త బిల్లు.. 10 ఏళ్ల జైలు.. రూ.10 కోట్ల జరిమానా..!
Anti-Paper Leak Law : విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకులకు సంబంధించి కీలక సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రతిపాదన ప్రకారం పేపర్ లీకులకు పాల్పడిన వారికి 10ఏళ్ల జైలు, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
Anti-Paper Leak Law
- పేపర్ లీక్ నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం దిశగా కేంద్రం చర్యలు
- ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
- విపక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభలు వాయిదా
Anti-Paper Leak Law : పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సోమవారం (జూలై 27) లోక్‌సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా నీట్ సహా పలు పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలు తీవ్ర ఆందోళనల నేపథ్యంలో 2024 ప్రవేశ పరీక్షల చట్ట సవరణ బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభలో విపక్షాల ఆందోళనల మధ్య యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టగా దీనిపై సభ్యుల సూచనలు స్వీకరించి చర్చ నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయితే, ఈ బిల్లు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని చర్చను ఇతర అంశాలతో మళ్లించవద్దని ఆయన సూచించారు.
సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు :
కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఈ సవరణ బిల్లును తీవ్రంగా విమర్శించాయి. ఈ బిల్లు అనేది శాశ్వత పరిష్కారం కాదని ఆరోపించాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో జరిగిన లాఠీచార్జిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. పేపర్ లీక్ ఘటనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం కూడా చర్చకు వచ్చింది.
Read Also : E20 Janatha Party: CJP సూపర్ హిట్.. పుట్టుకొచ్చిన మరో రెండు కొత్త పార్టీలు.. నెక్ట్స్ టార్గెట్..
ఈ కొత్త పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026 ప్రకారం.. ఇక పేపర్ లీక్ కేసులపై దర్యాప్తు రెండు నెలల్లోగా పూర్తి చేయాలి. పరీక్షలలో పేపర్ లీక్‌లు లేదా అక్రమ పద్ధతులకు పాల్పడిన వ్యక్తులకు కనీసం ఐదేళ్ల నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. సంఘటిత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా పడుతుంది.
సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే :
ప్రస్తుతం చట్టాల ప్రకారం.. వ్యక్తిగతంగా పేపర్ లీక్‌కు పాల్పడితే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు, రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు.
బిల్లులోని కొత్త సవరణలకు ఆమోదం లభిస్తే.. తీవ్రమైన కేసుల్లో గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
ఇదిలా ఉండగా, బిల్లుపై చర్చించే నేపథ్యంలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 3 గంటల వరకు వాయిదా పడగా, లోక్ సభ 5 గంటల వరకు వాయిదా పడింది.
