Kishan Reddy
High Tension at Union Minister Kishan Reddy House : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై, ఎన్టీయేను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కిషన్ రెడ్డికి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు అపాయింట్ మెంట్ కోరగా.. ఎలాంటి స్పందన రాకపోవటంతో విద్యార్థి సంఘాలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. కిషన్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని స్థానిక స్టేషన్లకు తరలించారు.
Also Read : వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్ .. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
నీట్ విషయంలో అక్రమాలు జరిగాయని ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడటంతో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షను వెంటనే రద్దుచేసి నిజమైన విద్యార్థులకు న్యాయం చేయాలని జాతీయ స్థాయిలో ఆందోళన జరగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఎన్ఎస్ యూఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూతోపాటు దాదాపు పది విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడిలో పాల్గొన్నారు.
Also Read : రుషికొండ అద్భుత రాజప్రాసాదాలను చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోంది..?
కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసేందుకు అపాయింట్ మెంట్ కోరినప్పటికీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు భారీగా తరలివచ్చి మంత్రి ఇంటిని ముట్టడించాయి. పోలీసులు అప్రమత్తమై విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్థానిక నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.