Khammam : ఖమ్మంలో టెన్షన్ టెన్షన్.. తెల్లారకముందే జేసీబీలు, డోజర్లతో వచ్చి.. ఇళ్లను కూల్చేశారు..
Khammam : ఖమ్మం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇండ్లను అధికారులు కూల్చేశారు.
Khammam
- ఖమ్మంలో టెన్షన్ వాతావరణం
- భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత
- బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు
Khammam : ఖమ్మం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇండ్లను అధికారులు కూల్చేశారు. మంగళవారం తెల్లవారుజామున జేసీబీలు, డోజర్లతో వచ్చిన అధికారులు ఇండ్ల కూల్చివేత చర్యలను చేపట్టారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపుతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 2వేల మంది పోలీసులు, జేసీబీలతో అధికారులు తెల్లవారు జామున ఆ ప్రాంతానికి చేరుకొని ఇండ్లను కూల్చేందుకు చర్యలు చేపట్టారు. తమ ఇండ్లను కూల్చొద్దంటూ స్థానిక పేదలు వేడుకున్నారు. తాము పదేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఇప్పుడు తమ ఇండ్లను కూల్చేస్తే మేము ఎక్కడికి వెళ్లాలంటూ అధికారులను ప్రశ్నించారు. అయితే, బాధితులను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా సామాన్లు తరలించారు.
వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా భూదాన భూముల్లోకి అడుగుపెట్టడంతో స్థానికంగా నివసిస్తున్న పేద ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తాము నిర్మించుకున్న ఇండ్లను తొలగించొద్దంటూ అధికారుల కాళ్లవేళ్ల పడ్డారు. అయినా అధికారులు కనికరించకుండా రేకుల షెడ్లు గుడిసెలను జేసీబీలతో తొలగించడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. గత పదేళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, అలాంటి మా గుడిసెలను కూల్చివేయడం సరైంది కాదని, తమకు ఇండ్లు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని లేని ఎడల ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.
