హస్తం పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఎంత స్ట్రాంగ్? కొండా సురేఖ, ఓరుగల్లు ఎమ్మెల్యేల పంచాయితీలో తేల్చిందేంటి?

ఫైనల్‌గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది.

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. భారత దేశంలో ప్రజలు ఎంత వరకు ఈ హక్కును వాడుకుంటున్నారో లేదో తెలియదు..ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం వాక్‌ స్వాతంత్రాన్ని అడ్డగోలుగా వాడేస్తుంటారు. ఒక్క సోనియా, రాహుల్ గాంధీని తప్ప ఎవరిని విమర్శించినా నో ప్రాబ్లమ్ అన్నట్లు ఉంటుంది హస్తం పార్టీ నేతల తీరు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో అయితే నేతల రూటే సెపరేటు. మొన్నటి వరకు కొండా సురేఖ, ఓరుగల్లు ఎమ్మెల్యేల పంచాయితీ నడిచింది. నోటీసులు అన్నారు. యాక్షన్ అన్నారు. విచారణ అంటూ కొన్ని రోజులు సాగదీశారు.

ఫైనల్‌గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది. జగిత్యాల, పటాన్‌చెరు పంచాయితీలో కూడా ఔట్‌పుట్‌ ఏంటో ఎవరికి తెలియదు. ఇలా మల్లురవి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్లు గాంధీ భవన్‌ మెట్లెక్కాయి. అయితే ఇందులో ఇప్పటివరకు ఏ ఒక్క ఇష్యూలోనూ ఎవరి మీద చర్యలు తీసుకున్నది లేదు.. సమస్యను దారిన పెట్టిన దాఖలాలూ లేవు.

Also Read: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్నాళ్లుగా ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు ట్వీట్‌లతో కాక రేపిన ఆయన ఇక ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తూ సీఎం టార్గెట్‌గా అటాక్ చేస్తున్నారు. రేవంత్ పాలన బాలేదని..తన మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని.. పదే పదే ప్రతిపక్షాలను తిట్టడం తప్పా చేసిందేమిటంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఏ త్యాగానికైనా సిద్ధమంటూ ..రాజీనామాకు రెడీ అనే సంకేతాలతో పార్టీలో కలకలం రేపుతున్నారు.

అంతేకాదు ..రైతుబంధు సరిగ్గా అమలు చేయట్లే..నీళ్లు అందట్లేదని జనాలు మాట్లాడుకుంటున్నారని చెప్తూ పరోక్షంగా కేసీఆర్‌ పాలనే బెటర్‌ గా ఉందనే రీతిలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. ఆయన ఆరు నెలలుగా ఎప్పుడూ ఏదో ఒక స్టేట్‌మెంట్‌ ఇస్తూ హాట్‌ టాపిక్‌ మారుస్తూనే ఉన్నా..క్రమశిక్షణ కమిటీ మాత్రం సైలెంట్‌గానే ఉంటోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్‌గా రేవంత్‌ను ఉద్దేశించి రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవి..ఆయనతో మాట్లాడుతామని..ఓపెన్‌గా స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండా ఆదేశిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు రాజగోపాల్‌రెడ్డికి మల్లురవి ఫోన్ చేసినట్లు కానీ, ఆయన వివరణ తీసుకోవడం గానీ జరగలేదని తెలుస్తోంది. అసలు సీఎం రేవంత్‌నే రాజగోపాల్‌రెడ్డి లైట్‌ తీసుకుంటుంటే..ఇక మల్లురవిని ఆయనెక్కడ పట్టించుకుంటారన్న చర్చ కూడా గాంధీ భవన్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

క్రమ‌శిక్షణ క‌మిటీ మెత‌క వైఖ‌రి?
పార్టీకి న‌ష్టం చేసేలా ఎవ‌రు వ్యవ‌హ‌రించినా క‌ఠినంగా వ్యవహరిస్తామని ఆ మధ్య కాస్త సీరియస్‌గానే డెసిషన్స్ తీసుకున్నారు. ఫ‌టా ఫ‌ట్‌గా ఒక‌రిద్దరిపై వేటు వేశారు. క‌రీంన‌గ‌ర్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసినా శ్రీనివాస్‌తో పాటు ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో సుభాష్‌ రెడ్డిపై వేటు వేశారు. కానీ త‌ర్వాత నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఎటూ తేల్చకుండా నానబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్రమ‌శిక్షణ క‌మిటీ మెత‌క వైఖ‌రిని పాలో అవుతుందన్న టాక్ ఉంది.

క్రమ‌శిక్షణ క‌మిటీ ఛైర్మన్‌గా మ‌ల్లుర‌వి బాధ్యత‌లు తీసుకున్న త‌ర్వాత ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి అన్నట్లుగా ఉందంటున్నారు. ఆ మాటకొస్తే క్రమశిక్షణ కమిటీ ఛైర్మనే క్రమశిక్షణ పాటించడం లేదన్న విమర్శలు వచ్చాయి. ఆలంపూర్ ఎక్స్ ఎమ్మెల్యే సంపత్‌ లాంటి వాళ్లు అయితే మల్లురవి మీదే కంప్లైట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎపిసోడ్ కంట్లో న‌లుసులా మారింది. నిత్యం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమ‌ర్శలు ఎక్కుపెడుతున్నారాయన. ప్రతిప‌క్షాల‌పై ఇష్టానుసారంగా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదంటూ సీఎం తీరునే త‌ప్పుప‌డుతున్నారు. ప‌దేళ్ల పాటు సీఎంగా ఉంటాన‌న్న రేవంత్‌ కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్‌రెడ్డి. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వకుంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌నే వ‌ర‌కు వెళ్తున్నారు.

మీడియాలో హడావుడి కోసం మల్లురవి ఏదో ప్రకటన చేసినా..రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఎలా ముందుకెళ్లాలో తేల్చుకోలేకపోతోందట క్రమ‌శిక్షణ క‌మిటీ. ఇప్పటి వ‌ర‌కు రాజ‌గోపాల్‌కు నోటీసుల ఇవ్వాలన్న ఆలోచ‌న కూడా చేయ‌డం లేదట. రాజ‌గోపాల్‌తో మాట్లాడిన త‌ర్వాత నోటీసులపై ఆలోచిస్తామంటున్నారంటే క్రమ‌శిక్షణ కమిటీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్‌నే టార్గెట్ చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి విషయంలోనైనా క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.