కరోనా ఎఫెక్ట్, భారీగా పెరిగిన నాటుకోడి ధర, కిలో రూ.500 పైనే

  • Publish Date - July 20, 2020 / 11:49 AM IST

కరోనా ప్రభావంతో నాటుకోడి కొండెక్కింది. హైదరాబాద్ లో నాటుకోళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కిలో కోడి ధర రూ.500 పైమాటే. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు. నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి బయటపడవచ్చునే ప్రచారంతో ధర ఎక్కువైనా వాటినే కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని చికెన్‌ సెంటర్‌లలో బ్రాయిలర్, లేయర్‌ కోళ్లతో పాటు నాటు కోళ్లను కూడా విక్రయిస్తారు. గత నెల రోజులుగా నగరంలో నాటు కోళ్లు అందుబాటులో లేవు. గ్రామాల నుంచి కోళ్లు దిగుమతి కాకపోవడమే ఇందుకు కారణమని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామాల్లోనే నాటు కోళ్ల ధరలు రూ. 300 నుంచి రూ. 350 వరకు పలుకుతున్నాయి. కొందరు వ్యాపారులు వీటిని నగరానికి తీసుకొచ్చి కిలో కోడి రూ. 500కు పైగా విక్రయిస్తున్నారు.

నాటుకోడికి డిమాండ్ పెరగడానికి కారణం సోషల్ మీడియా:
కరోనా నేపథ్యంలో పోషక విలువలున్న మాంసాహారాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ‘నాటు చికెన్‌ ’నే ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో పట్టణాలకు నాటుకోళ్ల పంపిణీపై తీవ్ర ప్రభావం పడటంతో అక్కడ నాటుకోళ్లకు కొరత ఏర్పడింది. ఎలాంటి ఇంజక్షన్లు, యాంటీబయాటిక్స్‌ వాడకుండా సహజ వాతావరణంలో పెరిగే నాటుకోడి అంటే మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టపడతారు. రుచికి రుచి, బలం, ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకంతో నాటుకోడిని కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఆషాఢ మాసంలో ప్రజలు వివిధ దేవతలకు బోనాలు, మొక్కులు చెల్లించుకునే క్రమంలో చాలామంది నాటుకోళ్ల వైపే మొగ్గు చూపుతారు. బ్రాయిలర్‌ కోళ్లపై అపోహలు ఉండటం కూడా నాటుకోళ్లకు డిమాండ్‌ పెరిగేలా చేసింది. కరోనాకు ముందు పల్లెల్లో కిలో నాటుకోడి రూ.200కి దొరికితే.. వాటిని పట్టణాలకు తీసుకెళ్లి రూ.250కి విక్రయించేవాళ్లు. ఇప్పుడు దాదాపు రెట్టింపయింది. జిల్లాలో రూ.260-280 వరకు ఉండే కిలో కోడి ధర రూ.400-450 కు పెరిగింది.

నాటుకోళ్ల కొరతకు కారణాలు:
గ్రేటర్‌లో గత 15 రోజులుగా నాటుకోడికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. కరోనా బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు నాన్‌వెజ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా బ్రాయిలర్‌ చికెన్‌లో అంతగా పోషకాలు ఉండవని నాటు కోళ్లపై మొగ్గు చూపుతున్నారు. దీంతో నాటు కోడికి విపరీతంగా డిమాండ్‌ పెరగడంతో పాటు ధరలు కూడా భారీగా పెరిగాయని చికెన్‌ వ్యాపారులు తెలిపారు. గ్రేటర్‌ శివారు ప్రాంతాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్, నల్లగొండతో పాటు రాయసీమ జిల్లాల నుంచి నాటు కోళ్లు నగరానికి దిగుమతి అవుతాయి. అయితే గ్రామాల్లోనూ ప్రజలు నాటు కోళ్లను తింటుండటంతో నగరానికి సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని నాటు కోళ్లను విక్రయించడం లేదని హోల్‌సేల్‌ కోళ్ల వ్యాపారులు తెలిపారు. సాధారణంగా నగరంలోని హోల్‌సేల్‌ వ్యాపారులు గ్రామాలకు వెళ్లి నాటు కోళ్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం పలు గ్రామాల్లో నాటు కోళ్లు దొరకడం లేదు. ఉన్నా అమ్మడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

నాటుకోడి పేరిట మోసాలు, ఇలా కనిపెట్టండి:
నాటుకోడి దొరక్క పోవడంతో భారీగా మోసాలు జరుగుతున్నాయి. కోళ్ల ఫారాల్లో నాటుకోడిని పోలినట్టు ఉండే కోళ్లు పెంచుతున్నారు. గుంటూరు నుంచి వ్యాన్‌లో తెచ్చి విక్రయిస్తున్నారు. ఆ కోళ్లను సైతం కిలో రూ.450కే విక్రయిస్తున్నారు. తెలియని వారికి నాటు కోళ్ల పేరుతో నాంపల్లి, ముర్గీచౌక్‌తో పాటు పలు చికెన్‌ సెంటర్‌లలో అమ్ముతున్నారు. గుర్తు పట్టకపోతే అంతే సంగతులు. ఊర్లలో పెరిగే నాటుకోడి కాళ్లు సన్నగా ఉంటాయి. బక్కగా పావురం మాదిరిగా ఉంటుంది. వదిలిపెడితే పట్టుకోవడం కష్టం, అదే ఫారాల్లో పెరిగే నాటుకోడి అచ్చం బాయిలర్‌ కోడిలాగే బలంగా కనిపిస్తుంది. కాళ్లు లావుగా ఉంటాయి. కదిలించినా కదలదు అదే గుర్తుగా కనిపెట్టవచ్చు. సో, బీ కేర్ ఫుల్.

ట్రెండింగ్ వార్తలు