Asifabad: కుక్క కరిచిన గేదె పాలు రెండు నెలలుగా తాగుతున్నారు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు ఆసుపత్రికి పరుగందుకున్నారు. ఈ విచిత్రమైన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల చంతలమానేరు మండల కేంద్రంలో వెలుగు చూసింది. విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు తాగుతున్న పాలు కుక్క కరిచిన గేదెవి అనే విషయం తెలియదు. అయితే తాజాగా ఒక దూడ చనిపోవడంతో విషయం ఆ నోట, ఈ నోట అందరికీ పాకింది. అంతే యాంటీ రేబిస్ వ్యాక్సీన్ వేయించుకోవడానికి సుమారు 302 మంది మండల కేంద్రానికి పరుగులు తీశారు.
Andhra Pradesh : ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం.. కడప జిల్లాలో గాలి బీభత్సానికి ఒకరు దుర్మరణం
చింతలమానేరు మండల కేంద్రానికి చెందిన కాసబోయిన నానయ్యకు 16 గేదెలు ఉన్నాయి. పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం ఒక గేదెను పిచ్చి కుక్క కరిచింది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తన వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. వందలాది మందికి పాలు, పెరుగు అమ్ముతున్నాడు. అయితే తాజాగా కుక్క కరిచిన గేదె దూడ చనిపోవడంతో విషయం బయటికి వచ్చింది.
అంతే.. పాలు, పెరుగు తీసుకున్నవారు భయంతో వణికిపోయారు. యాంటీ రేబిస్ వ్యాక్సీన్ కోసం పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల్లో మండల అధికారులు కూడా ఉన్నారట. అయితే నానయ్య మీద చాలా మంది మండిపడుతున్నారు. విషయం ముందు చెప్పాలని అంటున్నారు. ఇకపోతే, కుక్క కరిచిన గేదె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. చనిపోయిన దూడకు మరింకేదైనా జరిగి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.