Huzurabad Bypoll Result: ఈటల ఎలా గెలిచారు? దళితబంధు ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీదే హవా!

ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ఓటర్లు చివరకు బీజేపీకే పట్టంకట్టారు.

Huzurabad Bypoll Result: ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ఓటర్లు చివరకు బీజేపీకే పట్టంకట్టారు. సెంటిమెంట్‌ ముందు అభివృద్ధి, పథకాలు, హామీలు ఏవీ నిలవలేదు. సెంటిమెంట్‌ తుఫాన్‌లో అన్నీ కొట్టుకుపోయాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతగా ప్రచారం చేసినా.. గెలవలేకపోయింది. ఫస్ట్‌ రౌండ్‌ నుంచే తన ప్రభావం స్పష్టంగా చూపిస్తూ వచ్చిన ఈటల 24వేల 68ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు.

ఈటల గెలుపుతో హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగిరింది. పార్టీ గుర్తు మారిందే కానీ తన సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించారు ఈటల రాజేందర్‌. హుజూరా..బాద్‌షా తానేనంటూ.. ఏడోసారి ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేశారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ స్వగ్రామం హిమ్మత్‌ నగర్‌, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు స్వగ్రామంలోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ భారతీయ జనాతా పార్టీ లీడ్‌లో నిలిచింది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై ఈటల రాజేందర్‌ పైచేయి సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు ఫైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనూ బీజేపీ లీడ్‌లో నిలిచింది.

ఆత్మగౌరవ నినాదం ముందు.. అభివృద్ధి మంత్రం పనిచేయలేదు. గులాబీ జెండాకు గుడ్‌బై చెప్పి కాషాయ జెండా కప్పుకుని జనాల్లోకి వెళ్లిన ఈటలను పార్టీ ఏదైనా ఆదరించేది మాత్రం ఈటలనే అనే క్లారిటీ ఇచ్చారు. గులాబీ జెండాను మోసే వ్యక్తిని కాదని.. ఆ జెండాను నిలబెట్టిన వ్యక్తినని పదేపదే చెప్పిన ఈటల.. టీఆర్‌ఎస్‌ పార్టీపైనే విజయం సాధించారు.

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ సాధించిన మొత్తం ఓట్లు 1,06,780
గెల్లు శ్రీనివాస్‌ సాధించిన మొత్తం ఓట్లు 82,712
కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయింది.. వచ్చిన ఓట్లు : 3012

ట్రెండింగ్ వార్తలు