Hyderabad : పాతబస్తీలో బైక్ లతో యువకులు ర్యాష్ డ్రైవింగ్..ప్రశ్నించిన యువకుడిపై దాడి

హైదరాబాద్ లోని పాతబస్తీలో రాత్రి సమయంలో బైకర్స్‌ వీరంగం సృష్టించారు. దీన్ని ప్రశ్నించిన యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

Bikers rash driving in Hyderabad Old city :  బైక్ ఎక్కితే కొంతమంది యువకులకు ఒళ్లుపై తెలియదు. ఇష్టమొచ్చినట్లుగా ర్యాష్ డ్రైవ్ చేస్తు భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ర్యాష్ డ్రైవింగ్ లతో యువత హడలెత్తిస్తున్నారు. దీంట్లో భాగంగా నగరంలోని పాతబస్తీలో రాత్రి సమయంలో బైకర్స్‌ వీరంగం సృష్టించారు.

పాతబస్తీ ప్రాంతంలోని కాలాపత్తర్‌లోని ఓ కాలనీలో బైక్‌లతో యువత ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హంగామా చేశారు. కాలనీలో ర్యాష్‌గా ఎందుకు నడుపుతున్నారని ఓ యువకుడు వారిని ప్రశ్నించాడు. దీంతో సదరు యువకుడిపై రెచ్చిపోయారు బైకర్స్. యువకుడిని పట్టుకుని చితకబాదారు. అక్కడితో ఊరుకోకుండా యువకుడి ఇంట్లోకి చొరబడి మరీ దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

కుటుంబసభ్యులు గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీల ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు