హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ తనకు కనపడిన ఓ హృదయవిదారక ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు వివరించారు.
గుల్జార్ హౌస్ సమీపంలో జాహిద్ అనే వ్యక్తికి గాజుల దుకాణం ఉంది. ఆదివారం తెల్లవారుజామున జాహిద్ తన స్నేహితులతో కలిసి చార్మినార్ ప్రాంగణంలో ఉన్నాడు. జాహిద్‌కు స్థానిక మహిళ ఒకరు.. ఓ భవనం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఓ కుటుంబం చిక్కుకుపోయిందని తెలిపింది.
Also Read: గుల్జార్ హౌజ్ చరిత్ర ఏంటో తెలుసా? అది ఒక ఫౌంటెయిన్.. దాన్ని ఎందుకు కట్టారు?
దీంతో ఆ కుటుంబానికి సాయం చేయడానికి తన స్నేహితులతో కలిసి జాహిద్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అయితే, అప్పటికే ఆ ఇల్లు పూర్తిగా కాలిపోతూ కనపడింది. మంటల్లో చిక్కుకుపోయి కొందరు అప్పటికే కాలిపోయినట్లు జాహిద్ గుర్తించాడు. అతడికి కొన్ని మృతదేహాలు కనపడ్డాయి. ఓ మహిళ మంటల్లో కాలిపోతూ తన నలుగురు పిల్లలను రక్షించేందుకు గట్టిగా పట్టుకుంది. పిల్లలతో పాటు ఆమె కూడా కాలిపోయి విగతజీవిగా కనపడింది.
ఈ విషయాన్ని జాహిద్ మీడియాకు చెప్పాడు. “ఆ బిల్డింగ్ మెయిన్ డోర్ మొత్తం మంటల్లో కాలిపోతూ కనపడింది. దీంతో మేము షట్టర్‌ను, గోడను పగులగొట్టి లోపలికి ఫస్ట్‌ఫ్లోర్‌లోకి వెళ్లాం. ఓ గదిలో ఏడుగురు, మరో గదిలో ఆరుగురు ఉన్నారు. మంటలు బాగా వ్యాపించడంతో మేము వారికి కాపాడలేకపోయాం” అని జాహిద్ అన్నాడు.
కాగా, గుల్జార్‌హౌజ్ వద్ద కృష్ణా పెర్ల్స్ షాప్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి, పై అంతస్తులోకి మంటలు వ్యాపించాయి. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు.