గుల్జార్ హౌజ్‌ చరిత్ర ఏంటో తెలుసా? అది ఒక ఫౌంటెయిన్.. దాన్ని ఎందుకు కట్టారు?

జాతీయ వారసత్వ సంపదగా గుల్జార్ హౌజ్ గుర్తింపు పొందింది.

గుల్జార్ హౌజ్‌ చరిత్ర ఏంటో తెలుసా? అది ఒక ఫౌంటెయిన్.. దాన్ని ఎందుకు కట్టారు?

Updated On : May 19, 2025 / 12:26 PM IST

హైదరాబాద్‌ పాతబస్తీలోని గుల్జార్‌ హౌజ్‌ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గుల్జార్‌ హౌజ్‌ అంటే ఓ ఇల్లు కాదు. ఇది ఒక ఫౌంటెయిన్. 1591లో ముహమ్మద్ ఖులీ కుతుబ్ షా చార్మినార్‌ను నిర్మించారు. అలాగే, అప్పటి పాలకులు తమ రాజ్యంలోని ప్రజలతో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అనేక సౌకర్యాలను కల్పించారు.

ఇందులో భాగంగానే అప్పట్లో గుల్జార్ హౌజ్‌ను కట్టారు. అది ఒక నీటి తొట్టి ప్రాంతం. ఈ నీటి తొట్టిపేరు క్రమేణా ఆ ప్రాంతం పేరుగా మారింది. జాతీయ వారసత్వ సంపదగా గుల్జార్ హౌజ్ గుర్తింపు పొందింది. అప్పట్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి దాహాన్ని తీర్చేందుకు దీన్ని నిర్మించారు.

నాంపల్లి రైల్వే స్టేషన్ ముందున్న సరాయి నుంచి చార్మినార్ మీదుగా గోల్కొండకు వెళ్లే వ్యాపారులు, బాటసారులు ఈ గుల్జార్ హౌజ్ వద్ద సేద తీరేవారు. ఖులీ కుతుబ్ షా కాలంలో చార్మినార్ నిర్మాణం జరిగిన తదుపరి ఏడాది 1592లో చార్మినార్ నలువైపుల కమాన్ల నిర్మాణం జరిగింది.

Also Read: హైదరాబాద్‌లో బాంబుల తయారీ.. నగరంలో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

చార్మినార్ ముందున్న కమాన్ల మధ్యలో ప్రజలు, ప్రభువుల అవసరాల కోసం గుల్జార్ హౌజ్‌ను నిర్మించారు. విదేశీ వజ్ర వ్యాపారులు, బంగారు వ్యాపారులు ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహించేవారు. నాలుగు కూడలీల్లో చతురస్రంగా గుల్జార్ హౌజ్‌ను నిర్మించారు. ఈ ప్రాంతం గోల్కొండ రాజ్యంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడ సంప్రదాయ పండుగలు జరిగేవి. చార్మినార్ ఎదురుగా ఉన్న ద్వారాలకు ప్రత్యేకత ఉంది.

చార్మినార్, మదీనా మధ్యలో చుట్టూ సుప్రసిద్ధ చార్ కమాన్ సముదాయంలో గుల్జార్ హౌజ్‌ను నిర్మించారు. దీన్ని అప్పట్లో చార్-సుకా-హౌజ్ అనేవారు. అనంతరం సుకా హౌజ్‌గా దీనిపేరు రూపాంతరం చెందింది. ఆ తర్వాత గుల్జార్ హౌజ్‌గా దీని పేరు మారింది. దీని చుట్టూ ఉన్న నాలుగు కమాన్ల నుంచి 350 అడుగుల సమాన దూరంలో దీన్ని నిర్మాణం జరిగింది. ప్రస్తుతం వృత్తాకారంగా ఉంది. అప్పట్లో ఈ ఫౌంటెయిన్‌ నుంచి నాలుగు వైపులా వాగులు ప్రవహించి మూసీలో కలిసేవి.