హైదరాబాద్‌లో బాంబుల తయారీ.. నగరంలో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను సమీర్‌, సయ్యద్‌ లక్ష్యంగా చేసుకున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌లో బాంబుల తయారీ.. నగరంలో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

Updated On : May 19, 2025 / 9:34 AM IST

హైదరాబాద్‌లో పోలీసులు పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు. హైదరాబాద్‌లోని వారాసిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌, ఆంధ్రప్రదేశ్‌ విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ అరేబియాలోని ఐఎస్‌ ఉగ్రవాదుల నుంచి సయ్యద్‌ సమీర్‌, సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌కు ఆదేశాలు రావడంతో హైదరాబాద్‌లో పేలుళ్ల కోసం వారిద్దరు కలిసి విజయనగరంలో అమ్మోనియం సల్ఫేట్‌, అల్యూమినియం పౌడర్‌ను కొన్నారు.

వాటితో హైదరాబాద్‌లో బాంబులను తయారు చేశారు. ఈ బాంబులు పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని పరీక్షించేందుకు కొన్ని ప్రదేశాలను వారిద్దరు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వారు హైదరాబాద్‌లో ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు? నగరంలోని ఏ ప్రాంతంలో పేలుళ్లకు పాల్పడ్డాలని అనుకున్నారు? వారికి ఎవరు సహకరిస్తున్నారు? వంటి అంశాలను తేల్చేందుకు వారిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు చేపట్టిన జాయింట్‌ ఆపరేషన్‌లో వారిద్దరి గుట్టు రట్టయింది.

Also Read: తెలంగాణ వ్యాప్తంగా జోరువానలు కురిసే అవకాశం.. ఎల్లో అలర్ట్ జారీ

సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ తండ్రితో పాటు సోదరుడు పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. వారి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ బీటెక్‌ వరకు చదువుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో జాబ్‌ చేశాడు.

అదే సమయంలోనే సిరాజ్‌కు ఉగ్రవాదుల మాడ్యూల్స్‌తో పరిచయం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సిరాజ్‌ అమ్మోనియాతో పాటు సల్ఫర్‌, అల్యూమినియం పౌడర్‌ను కొన్నాడు. అనంతరం సిరాజ్‌పై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. అతడు సామాజిక మాధ్యమాల్లో కొంత కాలంగా పాక్‌కు అనుకూలంగా పోస్టులు చేస్తున్నాడు.

అతడిని పోలీసులు విచారించగా సయ్యద్‌ సమీర్‌ గురించి తెలిసింది. దీంతో సమీర్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సమీర్‌, సయ్యద్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను సమీర్‌, సయ్యద్‌ లక్ష్యంగా చేసుకున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.