HCU Lands Dispute : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం తెలంగాణలో ప్రకపంనలు రేపుతోంది. రాజకీయం మొత్తం ఈ భూముల చుట్టే తిరుగుతోంది. భూముల వ్యవహారం క్రమంగా రాజకీయ రగడగా మారింది. ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు విద్యార్థులు, ప్రతిపక్షం.. ఇరువర్గాల మధ్య వివాదం తారస్థాయిలో చేరింది.
భూముల వ్యవహారం ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. ఆ భూములు యూనివర్సిటీవి అని విద్యార్థులు, ప్రతిపక్షాలు అంటుంటే.. కాదు.. ప్రభుత్వానివి అని అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. భూములను వేలం వేసేందుకు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అగ్గి రాజేసింది. భూముల వేలం ప్రక్రియను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలానికి సంబంధించి మొదలైన వివాదం.. క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వేర్వేరు వాదనలు మాటల యుద్ధానికి తెరలేపాయి. మరోవైపు వర్సీటీ భూములు కాపాడుకుంటాం అంటూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలికడంతో పాటు ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూముల వివాదం హాట్ టాపిక్ గా మారింది. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్ధులు ఆందోళనకు దిగారు.
మరోవైపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్ సీయూ భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో దాదాపు 11 మంది మంత్రులతో సీఎం రేవంత్ చర్చించారు. అన్ని అంశాలపై డిస్కస్ చేసిన సీఎం రేవంత్… ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అటు.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వన ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
Also Read : హెచ్సీయూలో మళ్లీ ఉద్రిక్తత.. 400 ఎకరాల భూమి వ్యవహారంలో వివాదం ఏమిటి..? ప్రభుత్వం ఏం చెప్పింది..
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న హెచ్ సీయూ భూముల వివాదం.. పార్లమెంటును కూడా తాకింది. భూముల వ్యవహారాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశాన్నిలేవనెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, నగేశ్ ఉన్నారు.
రాజ్యసభ జీరో అవర్‌లో భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు ఎంపీ లక్ష్మణ్. 400 ఎకరాల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూముల విక్రయానికి సిద్ధమైందని ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను కాపాడాలని కోరారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. ఈ భూముల వ్యవహారంపై లోక్‌సభ జీరో అవర్‌లో తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు.
హెచ్ సీయూ భూములు వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 400 ఎకరాల భూమిని విక్రయించి 30 వేల కోట్లు సంపాదించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆ భూములను విక్రయించడానికి మీకు ఏం హక్కు ఉంది అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు.
హెచ్‌సీయూ పరిసర ప్రాంతాలు మాత్రమే హైదరాబాద్ లో స్వచ్ఛమైన గాలిని అందించే ప్రదేశాలుగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్ ఢిల్లీ మాదిరిగా వాయు కాలుష్యంతో నిండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని భూమిని సంరక్షించగలిగితే హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లా ఉపయోగపడుతుందన్నారు.
ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది. ఆ భూములు హెచ్ సీయూవి కావని, ప్రభుత్వానివని వాదిస్తోంది. హెచ్ సీయూ భూములను ఇంచు కూడా ప్రభుత్వం తీసుకోలేదని మంత్రులు చెబుతున్నారు. భూములపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర అని మండిపడ్డారు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్లు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రులు ధ్వజమెత్తారు.