Hyderabad Firing Incident: హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. చాదర్ ఘాట్ లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో.. డీసీపీ చైతన్యపై దొంగలు దాడికి యత్నించారని తెలిపారు. దీంతో తప్పని పరిస్థితుల్లో డీసీపీ చైతన్య దొంగలపై కాల్పులు జరిపారని చెప్పారు. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు అయ్యాయని, అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మరో దొంగ పారిపోయాడు అని వెల్లడించారు.
కాల్పుల్లో గాయపడ్డ దొంగను ఒమర్ గా గుర్తించారు పోలీసులు. దొంగల గురించి సీపీ సజ్జనార్ కీలక వివరాలు వెల్లడించారు. ఇద్దరు దొంగలు పాతబస్తీకి చెందిన క్రిమినల్స్ అన్నారు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ ఒమర్ పై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో 20 కేసులు ఉన్నాయన్నారు. అతడిపై రౌడీషీట్ కూడా ఉందన్నారు. రెండేళ్లు జైల్లోనే ఉన్నాడని అన్నారు. ఒమర్ హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని సీపీ సజ్జనార్ తెలిపారు.
”తోపులాటలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ఒమర్ ను ఆసుపత్రికి తరలించాం. ఇద్దరు దొంగలు పాతబస్తీకి చెందిన పాత నేరస్తులు. ఒమర్ పై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో 20 కేసులు ఉన్నాయి. దొంగలను పట్టుకునే క్రమంలో డీసీపీ చైతన్య, కానిస్టేబుల్ పై దాడికి యత్నించారు. దీంతో డీసీపీ చైతన్య దొంగలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించాం. డీసీపీ జరిపిన కాల్పుల్లో ఒమర్ ఛాతి, భుజంపై గాయాలయ్యాయి” అని సీపీ సజ్జనార్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
చాదర్‌ఘాట్‌లో సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను డీసీపీ చైతన్య గమనించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో చైతన్యపై ఓ దొంగ దాడికి ప్రయత్నించాడు. డీసీపీ గన్‌మన్ సైతం కింద పడిపోయారు. గన్‌మన్ వెపన్‌ను తీసుకున్న డీసీపీ చైతన్య దొంగలపై కాల్పులు జరిపారు. ఆ దొంగ భవనంపై నుంచి చాదర్ ఘాట్ లోని విక్టోరియా గ్రౌండ్ లోకి దూకాడు. తీవ్రగాయాలపాలైన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.
Also Read: అయ్యయో.. టీ ఎంత పని చేసింది? 75లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి.. కళ్ల ముందే..