malakpet Firing incident
Malakpet: మలక్‌పేటలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ అనంతరం స్నేహితులతో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సీసీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (43)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన్ను అడ్డగించిన ప్రత్యర్థులు ముందుగా అతడి కళ్లలో కారం చల్లారు. దీంతో చందు నాయక్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంటపడి తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో చందు నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చందు నాయక్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా నర్సాయిపల్లి. కుటుంబంతో కలిసి చైతన్యపూరిలో నివాసం ఉంటున్నాడు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించింది. ఆ ప్రాంతంలో ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నిందితులు ఎటు వెళ్లారన్నదానిపై సీసీ పుటేజ్‌లు పరిశీలిస్తున్నారు. స్పాట్‌లో ఉన్న సీసీ కెమెరాతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
పాతకక్షలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారు గుర్తించామని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. చందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భూ వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఓ స్థలంలో కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. అక్కడఉన్న కొంతమంది వ్యక్తులే చందుకు ప్రత్యర్థులుగా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి