×
Ad

Rain Alert : తెలంగాణ వాసులకు బిగ్ అప్డేట్.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

Rain Alert తెలంగాణలో పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Rain Alert

Rain Alert : తెలంగాణలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. అయితే, గత మూడు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. దక్షిణ ఒడిశా నుంచి ఏపీ తీర ప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని చెప్పింది.

Also Read: తెలంగాణలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు..! రేవంత్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారు?

ఇవాళ (ఆదివారం) నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

రేపు (సోమవారం) నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మంగళవారం ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, సిద్ధిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

వచ్చే నాలుగు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉందని, వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. వర్షాల సమయంలో చెట్ల కింద, పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.