Hyderabad: వేలంలో ఈ గణపతి లడ్డూకు రూ.25.5 లక్షలు.. ఇక అందరి దృష్టీ బాలాపూర్ లడ్డూపైనే..

వేలం పాట చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.

My Home Bhooja Ganesh Laddu 2023

My Home Bhooja Ganesh Laddu 2023: హైదరాబాద్‌లోని మాదాపూర్ మై హోమ్‌ భూజాలో గణపతి లడ్డూ వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి ఇవాళ గణేశుడి లడ్డూను రూ.25.5 లక్షలకు దక్కించుకున్నారు.

మై హోమ్‌ భూజా వాసులు ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. చివరి వరకు లడ్డూ వేలం ఉత్కంఠభరితంగా సాగింది. గత ఏడాది మై హోమ్‌ భూజాలో లడ్డూ రూ.20.5 లక్షలు పలికింది. 2021లో రూ.18.50 లక్షలకు లడ్డూ అమ్ముడుపోయింది.

ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలందుకున్న గణేశుడి లడ్డూను కొనుగోలు చేయడానికి భక్తులు అమితాసక్తి కనబర్చుతున్నారు. గణేశుడి లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను సమాజసేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.

కాగా, హైదరాబాద్ శివారులోని బాలాపూర్ గణేశుడి లడ్డూను గురువారం వేలం వేయనున్నారు. గత ఏడాది బాలాపూర్ లడ్డూ రూ.24.60 లక్షలు పలికింది. ఇక్కడ కూడా ప్రతి ఏడాది లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. ఈ సారి ఎంతకు పలుకుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో గణేశుడి నిమజ్జనానికి ముందు లడ్డూను వేలం వేస్తారు.

గణేశుడి లడ్డూను దక్కించుకోవడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. తమ బంధు, మిత్రులకు ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. హైదరాబాద్ లో జరిగే గణేశ నిమజ్జనానికి దేశ వ్యాప్తంగా పేరు ఉంది. గణేశ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలపై ఇప్పటికే పోలీసులు సూచనలు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 25,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13,000 మంది బందోబస్తు విధుల్లో ఉంటారు.

Ganesh Nimajjanam Hyderabad: మహాగణపతి నిమజ్జనానికి సర్వంసిద్ధం.. ప్రత్యేక బస్సులు, మెట్రో సేవలు.. పూర్తి వివరాలు ఇలా..

ట్రెండింగ్ వార్తలు