Hyderabad
Hyderabad Water supply shutdown : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా వాటర్ సరఫరాను వచ్చే 36గంటల పాటు నిలిపివేయడం జరుగుతుందని, ఆయా ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జలమండలి వర్గాలు పేర్కొన్నాయి.
నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్-3 కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు పంపింగ్ మెయిన్-1కి సంబంధించి 2,375 ఎంఎం డయా పైపులైన్ పై భారీ లీకేజీ ఏర్పడింది. ఈ కారణంగా ఎయిర్ వాల్వ్, గేట్ వాల్వ్ మార్పు, తదితర మరమ్మతుల చేపట్టనున్నారు.
ఈ కారణంగా పలు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో సోమవారం (13వ తేదీ) ఉదయం 6గంటల నుంచి మంగళవారం (14వ తేదీ) సాయంత్రం 6గంటల వరకు అంటే.. సుమారు 36గంటల పాటు తాగునీటి సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని జల మండలి వర్గాలు తెలిపాయి.
వాటర్ సరఫరా నిలిచిపోయేది ఈ ప్రాంతాలకే..
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, ప్రశాసన్ నగర్, ఫిలింనగర్, జూబ్లీ హిల్స్, తట్టిఖానా, భోజగుట్ట, షేక్‌పేట్, హకీంపేట్, కార్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్ హౌస్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్ పూర్, గంధంగూడ, బండ్లగూడ, శాస్త్రిపురం, అల్లబండ, మధుబన్ కాలనీల్లో తాగునీటి సర ఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
అదేవిధంగా.. ధర్మసాయి (శంషాబాద్), సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవీనగర్, నాగోల్, ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, స్నేహపురి కాలనీ, భారతనగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్దఅంబర్ పేట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జల మండలి పేర్కొంది.