Rain Alert : నేడు, రేపు ఈ జిల్లాల్లో వానలేవానలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన

Rain Alert : 15వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్ర్కమించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Rain Alert : నేడు, రేపు ఈ జిల్లాల్లో వానలేవానలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన

Rain Alert

Updated On : October 13, 2025 / 8:15 AM IST

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుండగా.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతుంది. అయితే, మరో రెండుమూడు రోజులు రాష్ట్రంలో వాతావరణం ఇలానే ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర భారత దేశం నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాల నిష్ర్కమణ తెలంగాణ ప్రాంతానికి చేరుకుంది. మే నెలాఖరున దక్షిణ భారతదేశాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. సెప్టెంబర్ 20వ తేదీ నాటికి ఉత్తర భారతదేశానికి పూర్తిస్థాయిలో చేరుకున్నాయి. దీంతో 24వ తేదీ నుంచి తిరుగుముఖం పట్టాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read : Minister Seethakka: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ గౌడ్‌కు నేను ఫిర్యాదు చేయలేదు.. ఏం జరిగిందంటే..? సీతక్క

ఈనెల 15వ తేదీ నాటికి తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్ర్కమించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవాళ, రేపు.. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలతోపాటు హైదరాబాద్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. అయితే, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జల్లులు, తరువాత మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని, ఈ రోజంతా వాతావరణం మేఘావృతమైన ఉంటుందని, సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


వర్షం పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, వర్షం సమయంలో చెట్ల కింద, హోర్డింగులు ఉన్న ప్రదేశాల్లో ఉండొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.