Hyderabad Police
Hyderabad Police : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా నకిలీ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంప్స్ దందా నడిపిస్తున్నారు. అచ్చం ఒరిజినల్ సర్టిఫికెట్లలానే ఉంటాయి. కానీ, ఒరిజినల్ కాదు. ఈ నకిలీ డాక్యుమెంట్స్ తో బ్యాంకులను బురిడీ కొట్టించి హోమ్ లోన్స్ తీసుకుంటున్నారు. అంతేకాదు, ఒక్కో డాక్యుమెంట్ ను రూ.10వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రబ్బర్ స్టాంప్స్ తో దందా సాగిస్తున్నారు. చివరికి వారి పాపం పండింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ రబ్బర్ స్టాంప్స్ తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నకిలీ పత్రాలతో లక్షలు కాజేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ డిపార్ట్ మెంట్లకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్స్, సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ ముఠా ఏ విధంగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి వాటి ద్వారా ఎలా సొమ్ము చేసుకుంటున్నారో తెలిసి పోలీసులే విస్తుపోయారు.
ఇప్పటివరకు 18మంది నిందితులను అరెస్ట్ చేశారు. 1687 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 1180 నకిలీ సర్టిఫికెట్లు, ఒక కంప్యూటర్, ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రంగారావుగా గుర్తించారు. ఒక్కో డాక్యుమెంట్ తయారీకి ఈ ముఠా 10వేల రూపాయల వరకు తీసుకుంటుందని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
”లీగల్ హెర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్, ల్యాండ్ రెగులరైజేషన్ స్కీమ్ సర్టిఫికెట్, ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్.. పరికరాలు ఉపయోగించి ఈ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటితో బ్యాంకులు, బిజినెస్ లోన్స్ తీసుకుంటున్నారు. రంగారావు గతంలో 2005లో అరెస్ట్ అయ్యాడు. 2015 నుంచి ఈ రాకెట్ నడుపుతున్నాడు” అని నకిలీ సర్టిఫికెట్స్ గ్యాంగ్ కు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
”ఫేక్ సర్టిఫికెట్స్ తో నిందితులు హోమ్, బ్యాంక్, బిజినెస్ లోన్ ఫ్రాడ్ కు పాల్పడుతున్నారు. వివిధ రకాల డిపార్ట్ మెంట్స్ కి చెందిన నకిలీ సర్టిఫికెట్లను, నకిలీ రబ్బర్ స్టాంప్స్ ను ముఠా తయారు చేస్తోంది. జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నట్లు నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల ద్వారా బ్యాంకు లోన్స్ తీసుకుంటున్నారు. నకిలీ రబ్బర్ స్టాంపులు, సర్టిఫికెట్లపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి.
ఈ ముఠా సభ్యులు నకిలీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని హోమ్ లోన్ కోసం నకిలీ పత్రాలు తయారు చేస్తోంది. కూకట్ పల్లిలో సుధాకర్ అనే వ్యక్తి హోమ్ లోన్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఇతడు.. హోమ్ లోన్ కు అవసరమైన డాక్యుమెంట్స్ గుర్తించి రంగారావుకి రెఫర్ చేస్తాడు. రంగారావు ఫేక్ రబ్బర్స్ స్టాంప్స్, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బ్యాంకుకు సబ్మిట్ చేసి హోమ్ లోన్ తీసుకున్నాడు” అని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.