Chinese Manja : హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మాంజా నిల్వలను సీజ్ చేసిన పోలీసులు.. అమ్మకందారులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 150 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పిన పోలీసులు.. నిషేధిత మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో చైనా మాంజా అమ్మకాలపై మరింత ఫోకస్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
దాదాపు 90 లక్షల విలువైన మాంజా సీజ్- టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్
”నిషేధిత చైనా మాంజాను సీజ్ చేశాం. 117 కేసులు నమోదు చేశాం. 150 మంది వ్యక్తులను అరెస్ట్ చేశాం. సీజ్ చేసిన మాంజా విలువ దాదాపు 90లక్షల వరకు ఉంటుంది. చైనీస్ మాంజా వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. పశుపక్షాదులకు హాని ఉంది. అందుకే, చైనా మాంజాను ప్రభుత్వం బ్యాన్ చేసింది. సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల ప్రకారం ఫెస్టవల్ కంటే ముందే.. నవంబర్ ఎండింగ్ నుంచి రెయిడ్స్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
డిసెంబర్ నెలలో ఓ గోదాంపై దాడి చేశాం. అక్కడ దాదాపుగా 30 లక్షల విలువైన చైనా మాంజాను సీజ్ చేయడం జరిగింది. మంగళ్ హాట్ ఏరియా, కాచిగూడ, సుల్తాన్ బజార్, అఫ్జల్ గంజ్ తదితర ఏరియాల్లో రైడ్స్ చేశాం. సికింద్రాబాద్ నార్త్ జోన్ ఏరియా, మార్కెట్ ఏరియాలోనూ సోదాలు చేయడం జరిగింది.
దయచేసి చైనా మాంజా వాడొద్దు- ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ప్రజలకు మా పోలీసుల విజ్ఞప్తి ఒక్కటే. ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. ప్రజల ప్రాణాలకు ముప్పు జరగకూడదు. అదే మా ఉద్దేశం. చైనా మాంజా వల్ల ఎవరికైనా అపాయం జరగొచ్చు. చైనా మాంజాను ఎవరూ వాడకూడదు. అందరూ ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే మనకు, సమాజానికి, పశుపక్షాదులకు మేలు జరుగుతుంది.”
మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా..
గాలి పటాలు ఎగరేసేందుకు ఉపయోగించే చైనా మాంజా దారం మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. గతంలో ఈ చైనా మాంజా కారణంగా ఎంతో ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాలి పటాలు ఎగరేసిన తర్వాత మాంజాను అలాగే వదిలేస్తున్నారు. దీని కారణంగా రోడ్లపై వెళ్లే వారి మెడలకు ఆ దారం చుట్టుకుని ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.
మనుషుల ప్రాణాలకే కాదు పశుపక్షాదుల ప్రాణాలకు కూడా ఈ చైనా మాంజా ప్రమాదకరంగా మారుతోంది. కళ్ల ముందే ఇన్ని ప్రాణాలు పోతున్నా.. ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. కాసుల కక్కుర్తితో వ్యాపారులు చైనా మాంజా విక్రయాలు కొనసాగిస్తున్నారు. చైనా మాంజా వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది అనే విషయం అందరికీ తెలుసు. అయినా, వాటి అమ్మకాలు కొనసాగిస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
Also Read : 10 టీవీ ఆఫీసు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్