Harish Rao : మళ్లీ కేసీఆర్ రాకుంటే.. అమరావతిలా హైదరాబాద్- మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

అమరావతిలో ఇప్పుడు బిజినెస్ మొత్తం పడిపోయింది. నేడు నీళ్ళ కష్టం లేదు. కరెంట్ కోతలు లేవు. కరవు లేదు, కర్ఫ్యూ లేదు. Harish Rao

Harish Rao On Amaravati

Harish Rao On Amaravati : తెలంగాణ మంత్రి హరీశ్ రావు నోట ఏపీ రాజధాని అమరావతి పేరు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ కేసీఆర్ రాకుంటే.. అమరావతిలా హైదరాబాద్ అవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుంటున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీపీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి పేరుని ప్రస్తావించారు.

బూతులు మాట్లాడే వాళ్లు కావాలా?
కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా? లేక బలహీనమైన నాయకత్వం ఉండాలా? ఇటువైపు బలమైన కేసీఆర్ ఉన్నాడు. అవతలి వైపు ఎవరున్నారు? ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్. కేసీఆర్ ది రైతుల ఎజెండా అయితే, వారిది బూతుల ఎజెండా. బూతులు మాట్లాడటం చాలా సులువు. కానీ నీళ్ళు ఇవ్వడం, రైతుబంధు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, అంబేడ్కర్ విగ్రహం కట్టడం కష్టం . బూతులు మాట్లాడే వాళ్ళు కాదు భవిష్యత్ నిర్మించే వాళ్ళు కావాలి. తెలంగాణకు బూతులు మాట్లాడే నేతలు కాదు.. అభివృద్ధి చేసే కేసీఆర్ లాంటి లీడర్లు కావాలి.

Also Read : గద్దర్ కూతురికి టికెట్.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్, ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారంటే

సన్నీడియోల్, రజినీకాంత్ ఆశ్చర్యపోయారు..
ఒకవైపు ఐటీ పరిశ్రమలు, మరోవైపు వ్యవసాయం అభివృద్ధి చేసింది కేసీఆర్. నేడు నీళ్ళ కష్టం లేదు. కరెంట్ కోతలు లేవు. నాడు హైదరాబాద్ లో కరెంట్ కావాలని పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నది కేసీఆర్. కరవు లేదు, కర్ఫ్యూ లేదు ఇక్కడ. హీరో సన్నీడియోల్ వచ్చి ఇక్కడి అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయారు. నేను నమ్మలేకపోతున్నా.. నేను హైదరాబాద్ లో ఉన్నానా లేక అమెరికాలోని నగరంలో ఉన్నానా అని ఆయన అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చెందింది అని ప్రశంసించారు. నేను హైదరాబాద్ లో ఉన్నానా? లేక న్యూయార్క్ నగరంలో ఉన్నానా? అని రజనీకాంత్ సైతం విస్తుపోయారు. హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యిందో అన్నది.. పక్క రాష్ట్రంలో ఉన్న రజినీలకు అర్థం అవుతున్నది. కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు.

మరోసారి కేసీఆర్ రాకుంటే బిజినెస్ ఔట్..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో భూముల ధరలు భారీగా పెరిగాయి. మరోసారి కేసీఆర్ రాకుంటే బిజినెస్ ఔట్ అవుతుందని, హైదరాబాద్ పరిస్థితి అమరావతిలా మారుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడుతున్నారట. ఇవాళ అమరావతిలో బిజినెస్ మొత్తం పడిపోయింది. మూడోసారి కేసీఆర్ గెలిస్తేనే మళ్లీ భూముల ధరలు పెరుగుతాయి. మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుందని, హైదరాబాద్ కు ఇంకా పెట్టుబడులు వస్తాయని, హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందని అనుకుంటున్నారు.

తెలంగాణ నెంబర్ 1..
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందింది. 7.7 శాతం గ్రీన్ కవర్ పెరుగుదల ఉంది. 6.6 మీటర్లు భూగర్భ జలాలు మీదకు వచ్చాయి. వడ్ల ఉత్పత్తి 99 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2 కోట్ల 48 లక్షలకు పెరిగింది. కేటీఆర్ కృషి వల్ల ఐటీ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఎక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్. ప్రతి ఏటా 10వేల మంది డాక్టర్లను అందిస్తున్నాం. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది.

Also Read : ఓడి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రిని చేశా, ఆయనే బీఆర్ఎస్‌కు ద్రోహం చేశాడు- తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్

బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్..
ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్ గిరి సహా హైదరాబాద్ లో అన్ని నియోజకవర్గాలు గెలిపించాలి. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవదు. అన్ని సర్వేలు ఇదే చెబుతున్నాయి. బీజేపీ డకౌట్ అవుతుంది, కాంగ్రెస్ రనౌట్ అవుతుంది. కేసీఆర్ సెంచరీ కొడతారు. దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలాగా మోసం ఉండదు. ద్రోహం ఉండదు. అందర్నీ కాపాడుకునే పార్టీ బీఆర్ఎస్” అని వ్యాఖ్యానించారు మంత్రి హరీశ్ రావు.

ట్రెండింగ్ వార్తలు