Biological E
Biological E : కరోనావైరస్ మహమ్మారి.. ప్రజలపై పగబడుతున్న వేళ హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగా, త్వరలో బయోలాజికల్-ఈ టీకా రానుంది. బయోలాజికల్-ఈ త్వరలోనే మూడో దశ ట్రయల్స్ ప్రారంభించబోతోంది. ఆగస్టు నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది. ఆగస్టు నుంచి నెలకు 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ మహిమ దట్ల తెలిపారు.
హ్యూస్టన్ లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, డైనవాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్ తో బయోలాజికల్ కంపెనీ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. గత నెల చివరిలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ రెగులేటర్ నుంచి అనుమతి పొందింది. గతేడాది నవంబర్ లోనే బయోలాజికల్ కరోనా వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. మొత్తం 360 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు జరిపినట్టు సంస్థ తెలిపింది. ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టనుంది. ఇది 18 నుంచి 80 సంవత్సరాల వయసులో వ్యాధి నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తిని, భద్రతను అంచనా వేస్తుంది.
బయోలాజికల్ మొదటి డోసు వేసుకున్న తర్వాత 28రోజులకు రెండో డోసు వేసుకోవాలి. టీకా ట్రయల్స్ సురక్షితమైనవిగా, సమర్థవంతమైనదిగా తేలినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ టీకా అందుబాటులోకి వస్తే పేద, మధ్య తరగతి దేశాలకు పెద్ద ఊరట లభిస్తుందని టెక్సాస్ మెడికల్ కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ మరియా ఎలెనా తెలిపారు. అలాగే బయోలాజికల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
కరోనా కేవలం మనిషి ఊపిరితిత్తులను దెబ్బతీయటమే కాదు దీని బారినపడిన వారిలో రక్తం గడ్డ కట్టడం వంటి క్లిష్ట పరిణామాలను కూడా తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు కరోనా అనగానే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధి అనుకుంటూ వచ్చారు. కోవిడ్ కు గురైన కొందరిలో తలెత్తిన పరిణామాల దశలో ఇతరత్రా ఈ వైరస్ తీసుకొస్తున్న అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.