ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు.. మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు: ఎర్రబెల్లి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ప్రణీత్‌రావు ఎవరో కుడా తెలియదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Errabelli Dayakar Rao: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. మంగళవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని, వైఎస్సార్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదని గుర్తు చేశారు. బిజినెస్, ల్యాండ్ దందాలు.. తప్పుడు పనులు చేసేవారే అధికార పార్టీలోకి పోతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ప్రణీత్‌రావు ఎవరో కుడా తెలియదని అన్నారు. తన పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఉన్నతాధికారులు వత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు
కాంగ్రెస్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ”ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు. నీళ్లు లేక పంటలు ఎండి పోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు దైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమి కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్ లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదని” ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Also Read: అయోధ్యకు వెళితే బీజేపీలో చేరుతున్నట్టా?: శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారు: దాస్యం
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. రాష్ట్రంలోని చోటా భాయ్, కేంద్రంలోని బడా భాయ్ కలిసి కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎండిపోయిన పొలాలు, కాలిపోతున్న మోటార్లు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఫోటోతో గెలిచిన నాయకులు ఇప్పుడు పార్టీ మారుతున్నారు.. పార్టీ మారిన నాయకులతో క్యాడర్ పోవట్లేదు. పచ్చని చెట్టుకు ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టు పోతున్నారు. మళ్ళీ చెట్టు చిగురిస్తుంది, కాయలు కాస్తాయని వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.

Also Read: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీపై జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు