×
Ad

IBomma Ravi : ఐబొమ్మ రవి కేసు.. ఫ్రెండ్‌కు పెట్టిన ఆ ఒక్క మెసేజ్‌తో.. పోలీసుల చేతికి చిక్కాడిలా..!

IBomma Ravi : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

iBomma Ravi Case

iBomma Ravi Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో పోలీసుల కస్టడీ ముగిసింది. రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు మెయిల్స్‌ను సీసీఎస్ పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోలీసుల విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరూ సహకరించలేదని, ఒక్కడినే అంతా చేశానని రవి చెప్పినట్లు తెలిసింది. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేశానని రవి పోలీసుల విచారణలో పేర్కొనట్లు సమాచారం. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్స్ కి వెళ్లాడు.

అరెస్ట్‌ను ముందే పసిగట్టిన రవి..
తన దగ్గరున్న హార్డ్ డిస్క్‌ల్లో సినిమాలు తప్ప మిగతా డేటా మొత్తాన్ని రవి తొలగించినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు. దొరికిన టైమ్ ను సద్వినియోగం చేసుకుని తన సర్వర్ వివరాలు, వెబ్ సైట్ల వివరాలన్నీ ఎవరికీ దొరకకుండా రవి మాయం చేశాడని సమాచారం. విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడట. పైరసీ నెట్ వర్క్ గురించి నోరే విప్పడం లేదు. అయితే, కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయటపెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. ప్రతి 15, 20 రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు

ఫ్రెండ్‌కు పెట్టిన మెస్సేజ్ రవిని పట్టించిందా..?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రవి అరెస్టుకు ముందే ఐబొమ్మ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ -మెయిల్ లింక్ ఆధారంగా రవి కదలికలను పసిగట్టారు. అతను ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడ లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరెవరితో మాట్లాడుతున్నాడనే విషయాలపై కూపీ లాగారు. ఎక్కువగా విదేశాల్లో ఉండే రవి.. హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం కూకట్‌పల్లిలోని తన స్నేహితుడిని కలిసేవాడని పోలీసులు గుర్తించారు. అతనితో మద్యం తాగేవాడని తెలిసింది. ఈ-మెయిల్ లింకుల ద్వారా పోలీసులు నగరంలోని ఆ మిత్రుడెవరో గుర్తించారు. అతని ఫోన్ నెంబర్ సంపాదించి.. రవి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవి.. కూకట్‌పల్లిలోని తన ఫ్రెండ్ కు మెస్సేజ్ పెట్టాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. నేరుగా రవి ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్, వైజాగ్ లో విలువైన ఆస్తులు..
ఐబొమ్మ రవి ఎక్కువగా విదేశాల్లోనే ఉండేవాడు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్ ల్యాండ్, దుబాయ్ దేశాలకు టూర్ లు వేశాడు. సెయింట్ కిట్స్ నేవీస్ పౌరసత్వం తీసుకున్నాడు. విదేశాల్లో ఉన్న సోఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్ వర్క్ ను నడిపాడు. రవికి చెందిన ఒక బ్యాంక్ అకౌంట్ లో 3.5 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, వైజాగ్ లో రవికి ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. బిజినెస్ క్లాస్ ట్రావెల్ ఫ్లైట్స్ లో తిరుగుతూ, లగ్జరీ హోటల్స్ లో గడిపాడు. ఒంటరిగానే ఉంటూ లావిష్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసినట్లు పోలీసుల ముందు రవి అంగీకరించాడు. అయితే, ఈ పైరసీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాలపై మాత్రం రవి నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల ప్రశ్నలకు మర్చిపోయా, తెలియదు అంటూ సమాధానం చెబుతున్నాడని తెలిసింది. మరోవైపు.. రవి పోలీసు కస్టడీ ముగిసింది. అతను ఎలాంటి విషయాలు చెప్పకపోవడంతో పోలీసులు అతడిని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది.

Also Read: Rain Alert : మరో తుపాను ముంచుకొస్తుంది.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్షాలు కురిసే చాన్స్.. వాతావరణ శాఖ కీలక సూచనలు