iBomma Ravi Love Story
iBomma Ravi Love Story : సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ అనే వెబ్‌సైట్‌లో పెట్టి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి. చేసేదే తప్పు పని అయితే దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఇంకేముంది పోలీసులు ఫోకస్ చేసి మరీ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు. దీంతో ఐ బొమ్మ సైట్ క్లోజ్ చేశామని ఆ సైట్‌లో ఓ మెసేజ్ కూడా వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఐ బొమ్మ రవి గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో అతని గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అతని లవ్ స్టోరీ అంశం తెరపైకి వచ్చింది.
ఐబొమ్మ రవి అరెస్టు తరువాత నగర సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులోనూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవంతో అతను మనుషులపై నమ్మకాన్ని కోల్పోయాడని, నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఈనెల 14న కూకట్‌పల్లిలోని నిందితుడి నివాసంలో పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఇల్లంతా చిందరవందరగా ఉండటం, దుమ్ము ధూళితో ఉండటాన్ని గమనించారు. రెండు నెలలకో దేశం తిరిగినా తప్పనిసరిగా రవి ఇంటికి చేరేవాడు. తన గుట్టు బయటపడుతుందనే భయంతో మనుషులపై నమ్మకం సన్నగిల్లడం కారణంగా పనివాళ్లను ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: I Bomma : ఓరి బాబు.. ఐ బొమ్మ పోయింది అనుకునేలోపే ఇంకో బొమ్మ.. కానీ క్లిక్ చేస్తే..
ఐబొమ్మ రవి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ వివాహమే అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అమీర్‌పేట్‌లోని కోచింగ్ సెంటర్లో యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి చేసుకున్న తరువాత ఏడాది పాటు దంపతులు సంతోషంగా ఉన్నారు. వారికి కుమార్తె కూడా ఉంది. ఏడాది తరువాత ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య చిచ్చురేపాయి. మరోవైపు.. భార్య అక్క.. విదేశాల్లోని తమ కుటుంబాలు ఉన్నతంగా ఉన్నాయని ఎగతాళి చేసేదని తెలిసింది. ఆమెకు భార్య, అత్త వంత పాడటంతో రవికి, ఆమె భార్యకు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.
పలు సందర్భాల్లో భార్యాభర్తల మధ్య ఘర్షణలుసైతం జరిగినట్లు తెలిసింది. దీంతో వారిద్దరూ విడిపోయారు. కుమార్తెను భార్య తీసుకెళ్లటంతో రవి ఒంటరిగా మిగిలాడు. ఆ తరువాత కొంతకాలంకు పైరసీ సినిమాలు, గేమింగ్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు కొనసాగించాడు. వచ్చిన డబ్బుతో విదేశాలకు తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. కూతుర్ని చూడాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని విచారణ సమయంలో పోలీసుల వద్ద రవి పేర్కొన్నట్లు సమాచారం.