marry
marry disabled woman : దివ్యాంగురాలైన యువతిని సకలాంగుడు పెండ్లి చేసుకుంటే అందించే నగదు ప్రోత్సాహకంతో పాటు కల్యాణలక్ష్మి లేదా షాదీ ముబారక్ ఆర్థిక సాయాన్ని కూడా పొందవచ్చని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. సకలాంగుడు దివ్యాంగురాలిని పెండ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ జంటకు రూ. లక్ష నగదు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 ప్రకారం కల్యాణలక్ష్మి లేదా షాదీ ముబారక్ కింద అందించే మొత్తానికి అదనంగా 25 శాతాన్ని అంగే రూ.1,25,145 కూడా అందిస్తున్నది. ఈ మేరకు ఆ జంటకు మొత్తం రూ.2,25,145 సాయం కింద అందజేస్తుంది.
కాగా, కల్యాణలక్ష్మి లేదా షాదీముబారక్ పొందిన వారు ప్రభుత్వం దివ్యాంగులకు అందించే వివాహ నగదు ప్రోత్సహకానికి అనర్హులని సాగుతున్న ప్రచారాన్ని శైలజ ఖండించారు. అర్హులైన దివ్యాంగులు రెండు పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల సంక్షేమ అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసినట్టు పేర్కొన్నారు.