Vikarabad Collector Incident : వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో కుట్రకోణం దాగి ఉందన్నారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్య నారాయణ. బీఆర్ఎస్ నేత సురేశ్ కావాలనే కలెక్టర్ ను గ్రామంలోకి తీసుకెళ్లారని, ఇందులో పోలీసుల వైఫల్యం ఎక్కడా లేదన్నారు. దాడి కేసులో ఇప్పటికే 20మందిని అరెస్ట్ చేశామని, ఇప్పటికే 3 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ప్రస్తుతం సురేశ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా ఐజీ సత్యనారాయణ చెప్పారు. వికారాబాద్ కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి చేసిన కేసును పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుందని ఐజీ వెల్లడించారు.
‘పోలీసు వైఫల్యం అనేది కరెక్ట్ కాదు. ప్రజాభిప్రాయానికి సంబంధించి 140 మంది ఫోర్స్ తో, ముగ్గురు డీఎస్పీలతో బందోబస్తు ఏర్పాటు చేశాం. 12.50 గంటలకు లగచెర్లకు చెందిన సురేశ్ అనే రైతు ముగ్గురితో అక్కడికి వచ్చాడు. కలెక్టర్ ను రిక్వెస్ చేశాడు. మీరు ఇక్కడుంటే కాదు.. వికారాబాద్ నుంచి వచ్చిన వాళ్లు లగచెర్లకు వస్తే రైతులు చాలా సానుకూలంగా ఉంటారు. మీరు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారో దానికి చాలా సానుకూలంగా స్పందిస్తారని సురేశ్ నమ్మించాడు. దాంతో కలెక్టర్ ఓకే చెప్పారు. ప్రజలతో మమేకమై, ప్రజల ద్వారా మాట్లాడి ముందుకు వెళ్లాలని అనుకున్నారు. సురేశ్ చెప్పినట్లే గ్రామానికి వెళ్లిపోయారు.
అయితే అక్కడ గ్రామస్తుల కోపంగా ఉంటారు, ఎమోషనల్ గా ఉంటారు. కొంచెం అనుమానంగా ఉందని పోలీసులు కలెక్టర్ తో చెప్పారు. అయితే, రైతులు, ప్రజలు మన వాళ్లే. వారితో మమేకం అవ్వకుంటే ఎలా? బలవంతంగా కాదు. ప్రజల మన్ననలతోనే, ప్రజల అభిప్రాయలతోనే, వారి ఇష్టంతోనే మనం ముందుకు తీసుకెళ్లాలి అనే దృక్పథంతో కలెక్టర్ బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ స్పీడ్ గా ముందుకు వెళ్లే సరికి.. ఆయన వెంట ముగ్గురు డీస్పీలు కూడా వాహనాల్లో పరిగెత్తారు. వెనకాల మిగతా ఫోర్స్ వచ్చేలోగానే.. ఇది జరిగిపోయింది. కలెక్టర్ అక్కడికి వెళ్లగానే.. వాళ్లు దాడికి పాల్పడ్డారు. కలెక్టర్ వెళ్లి రెండు నిమిషాల వ్యవధిలోనే ఆయనపై అటాక్ చేశారు.
ముఖ్యంగా కడా ఛైర్మన్, అడిషనల్ కలెక్టర్ ను వారు టార్గెట్ చేశారు. ముందస్తు ప్రణాళికతో, వెల్ ప్లాన్డ్ తోనే దాడికి పాల్పడ్డారు. ఇందులో కుట్రకోణం కూడా ఉంది. పోలీసులు వద్దని చెప్పి.. సానుకూల దృక్పథంలో కలెక్టర్ వెళ్లారు. అయినప్పటికీ.. కర్రలు, రాళ్లతో దాడి చేయడం దారుణం. ఇందులో ముందస్తు ప్రణాళిక ఉంది. కుట్రకోణం ఉంది. ఈ ఘటనలో 20 మంది ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నాం. సురేశ్ అనే వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ చాలా బ్యాడ్ గా ఉంది. ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.
ప్రస్తుతం అతడు ఏ1గా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడని తెలిసింది. యూత్ లీడర్ గా ఉన్నాడు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన, అంతకుముందు జరిగిన ఒక కిడ్నాప్ కేసులో సురేశ్ కాల్ డేటాతో పాటు.. దాడిలో యాక్టివ్ గా ఉన్న వారి కాల్ డేటాను అనలైజ్ చేస్తున్నాం. నాలుగు దర్యాఫ్తు బృందాలు పని చేస్తున్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతటి వారున్నా, ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సైబర్ క్రైమ్ టీమ్ కూడా కంటిన్యూ యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు” అని ఐజీ సత్యనారాయణ తెలిపారు.
Also Read : అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఆగ్రహం