Imd Predicts Forecasts Rainfall For Next Five Days
IMD predicts forecasts rainfall : రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది. దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్‌వరకు ఉపరితలద్రోణి ఏర్పడింది. ఉత్తర కేరళ నుంచి ఇంటీరియర్ కర్ణాటక, మరాఠ్వాడ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఈ ఉపరితలద్రోణి బలహీనపడింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం (ఏప్రిల్ 14) గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ సహా 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ధాన్యం తడువగా, మామిడికాయలు రాలిపోయాయి. మధ్యాహ్నం వరకు ఎండ రాగా.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.