మరో 5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..! ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించింది.

Telangana Rains : తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ అంతటా దాదాపుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంది. ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

”మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు క్కడ కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి” అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.

ఈసారి ఎండలు మండిపోయాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సూర్యుడు నిప్పులు కురిపించాడు. దీంతో జనం విలవిలలాడిపోయారు. ఓవైపు మండుటెండలు, మరోవైపు వడగాలులు.. ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇప్పుడా పరిస్థితి నుంచి రిలీఫ్ లభిస్తోంది. వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించింది. వాతావరణం చల్లగా మారడంతో జనం రిలాక్స్ అవుతున్నారు.

Also Read : హమ్మయ్య.. శాంతించిన సూర్యుడు.. దేశంలో తగ్గిన ఎండలు, వడగాలులు

ట్రెండింగ్ వార్తలు