Telangana CM Revanth Reddy : చకా చకా హామీల అమలు.. తొలిరోజే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే పలు హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు తొలిరోజే సీఎం రేవంత్ అధికారులకు చకా చకా ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సీఎం ఆదేశాలు జారీ చేశారు....

Telangana CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే పలు హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు తొలిరోజే సీఎం రేవంత్ అధికారులకు చకా చకా ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో 9వతేదీ నుంచి మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలు దస్త్రాలపై సీఎం తొలి సంతకం చేశారు.

అనంతరం దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన హామీ మేర ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఇచ్చారు. మొదటి రోజే తెలంగాణలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సీఎం సమీక్షించారు. 200 యూనిట్ల వినియోగంపై ఉచితం హామీలు అమలు గురించి అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉచిత తాగునీటి సరఫరాను 20వేల నుంచి 25వేల లీటర్లకు పెంచుతామనే కాంగ్రెస్ హామీ అమలుకు సీఎం ఆదేశాలతో హైదరాబాద్ జలమండలి అధికారులు లెక్కలు వేస్తున్నారు.

మొత్తం మీద కాంగ్రెస్ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హామీల అమలుకు అధికారులు ఆఘమేఘాల మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రగతి భవన్ ను పూలే ప్రజాభవన్ గా మార్చి ఇనుప కంచెను బద్దలు కొట్టించారు. శుక్రవారం ఈ ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 9వతేదీన కొత్త శాసనసభ్యుల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.

ALSO READ : విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్, సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం

గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలపై కూడా సీఎం చర్చించారు. తుపాన్ ప్రభావంతో భారీవర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వివరాలు పంపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో పాల్గొని పలు హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ఇంద్రవెల్లిలో గిరిజన అమరవీరుల స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశంతో ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు కోసం ఎకరం భూమిని కేటాయిస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు.

indravelli stupam

ALSO READ : 24గంటల విద్యుత్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేర ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి మొక్కలు నాటారు. గ్రామ సర్పంచి గాంధారి అధ్యక్షతన గ్రామ సభ కూడా నిర్వహించారు. అమరవీరుల స్మృతి వనం ఏర్పాటుకు రూ.93లక్షలు అవసరమని కలెక్టర్ ప్రతిపాదనను చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి పంపించారు.

ALSO READ : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్ర‌యాణం

దీంతో పాటు ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ జొజ్జు పటేల్ చెప్పారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అక్కంపేటలో గ్రామ సభ నిర్వహించి రెవెన్యూ గ్రామంగా చేయాలని కోరుతూ తీర్మానం చేసి పంపించారు. మొత్తంమీద సీఎం రేవంత్ రెడ్డి స్పీడుగా ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ అధికారుల్లో దడ పుట్టించారు.

ట్రెండింగ్ వార్తలు