Insects Attack : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామస్తులపై పురుగులు దండెత్తాయి. ప్రతి రోజు సాయంత్రం గ్రామస్తులపై పురుగులు దాడి చేస్తున్నాయి. పరుగుల దాడితో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను కొల్హారీ వద్ద గోదాంలో నిల్వ చేశారు మార్క్ ఫెడ్ అధికారులు. ఏడాది నుంచి గోదాంలో జొన్నలు నిల్వ ఉండటంతో పురుగుల బెడద ఎక్కువైపోయింది. గ్రామ సమీపంలో గోదాం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మార్క్ ఫెడ్ గోదాం దగ్గర గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
అధికారుల నిర్లక్ష్యం గ్రామస్తుల పాలిట శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన మార్క్ ఫెడ్ గోదాంలో నిల్వ ఉంచిన జొన్నలు ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారాయి.
Also Read : మంత్రివర్గ విస్తరణ.. శాఖల మార్పులు, చేర్పులు? క్లైమాక్స్‌లో ఛాన్స్ కొట్టేసేందుకు కొందరి యత్నాలు..
జొన్నలపై వాలిన పురుగులు ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులపై దాడి చేస్తున్నాయి. వేలాది పురుగులు గ్రామంలోని ఇళ్లలోకి చొచ్చుకుపోతున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుంచి గ్రామస్తులంతా కలెక్టర్ దగ్గరికి వెళ్లి తమ బాధలు చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మరో దారి లేక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పురుగుల బారి నుంచి తమను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
”గోదాం నుంచి పరుగులు గ్రామంలోకి వస్తున్నాయి. మూడు నెలల నుంచి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. గోదాం నుంచి జొన్నలు తీసేస్తామని చెప్పి వెళ్లిపోయారు. కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్లి మా సమస్య గురించి చెప్పుకున్నాం. పాలు తాపితే మా పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు. పరుగులు కళ్లలోకి వెళ్లడంతో మంటలు పుడుతున్నాయి. నోట్లోకి పోతున్నాయి. నెత్తి గోక్కుంటున్నాము. పడుకునే పరుపులో పురుగులు, తాగే నీళ్లలో పురుగులు, తినే తిండిలోనూ పురుగులే. ఎక్కడ చూసినా లక్క పురుగులే.
మా నెత్తి నిండా పురుగులే, చెవులలో పురుగులే, తిండిలోనూ పురుగులే, నీటిలోనూ పురుగులే. వేసుకున్న దుస్తుల్లోనూ పురుగులే. మంట పెట్టి వంట చేసుకుందాం అనుకుంటే పురుగులు వచ్చి పడుతున్నాయి. ఊరంతా పురుగులే” అంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మార్క్ ఫెడ్ కు సంబంధించిన రెండు భారీ గోదాములు ఉన్నాయి. దాదాపు 4వేల 500 టన్నులకు జొన్నలు గోదాంలో సంవత్సరానికి పైగా నిల్వలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. వాటి వల్లే పురుగులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. అధికారులు గోదాం నుంచి జొన్నలను ఎందుకు తరలించడం లేదు అన్నదానిపై స్పష్టత లేదు.
చివరికి గ్రామస్తులు ధర్నాకి దిగడంతో ఉన్నతాధికారులు స్పందించారు. గోదాం దగ్గరికి వచ్చిన అధికారులు.. జొన్నలు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, తాత్కాలిక పరిష్కారంగా పురుగులు పట్టిన జొన్నలకు మందులు పిచికారీ చేశారు అధికారులు. మొత్తంగా గోదాం నుంచి వచ్చే పురుగుల నుంచి తమకు రక్షణ కల్పించాని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.