మంత్రివర్గ విస్తరణ.. శాఖల మార్పులు, చేర్పులు? క్లైమాక్స్‌లో ఛాన్స్ కొట్టేసేందుకు కొందరి యత్నాలు..
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశం తుదిదశకు వచ్చినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

రోజుకో అప్డేట్.. లీకుల మీద లీకులతో పదిహేను నెలలుగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ డైలీ ఎపిసోడ్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతోన్న డెవలప్‌మెంట్స్‌ను బట్టి చూస్తే ఈ సారి మంత్రివర్గ విస్తరణ పక్కా అంటున్నారు. ఉగాది తర్వాత ఒకటి రెండ్రోజుల్లోనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఢిల్లీ వెళ్లిన హస్తం పార్టీ పెద్దలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రకరకాల చర్చలు జరిపారట. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో.. మొదటగా అధిష్టానం హామీ ఇచ్చినవారికి చోటు కల్పించాలని నిర్ణయించారట. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌తో పాటు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం వాకిట శ్రీహరి ముదిరాజ్‌కు బెర్తులు కన్ఫామ్ అయ్యాయని అంటున్నారు.
ఇక మిగతా మూడు బెర్తులలో కూడా ఒకటి కచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారు. రెండో బీసీ పేరు విషయంలో రకరకాల సమీకరణాల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అవకాశం దక్కబోతోందట. ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉండగా రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కనుంది.
ఐలయ్యకు అవకాశం ఇస్తే?
దీంతో ఒక జిల్లా నుంచి ముగ్గురు రెడ్లు ఉంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి చూస్తే రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే అదే జిల్లా నుంచి బీర్ల ఐలయ్యకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని టాక్. అంతేకాదు ఐలయ్యకు అవకాశం ఇస్తే అతిపెద్ద సామాజికవర్గమైన యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించినట్లు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. దీంతో ఒక్క భర్తీతో రెండు ఈక్వేషన్స్ వర్కౌట్ చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు.
ఇలా నాలుగు బెర్తులు ఖాయం కావడంతో మిగిలిన రెండు బెర్తుల విషయంలో ఒక దాని కోసం సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుబడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. దీంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని సీఎం కోరుతున్నారట. సుదర్శన్‌రెడ్డి విషయంలో సీఎం చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేసి అధిష్టానాన్ని ఒప్పించినట్లు టాక్ నడుస్తోంది. సుదర్శన్‌రెడ్డి విషయంలో సీఎం సక్సెస్ కావడంతో..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రేమ్‌సాగర్‌రావుకు మినిస్ట్రీ ఇవ్వాలని పట్టు పడుతున్నారట.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్‌తో పాటు ప్రేమ్‌సాగర్‌రావుకు కూడా ఇవ్వాలని అందుకుదగ్గ ఈక్వేషన్స్‌ను కూడా భట్టి వివరించారట. భట్టి చెప్పిన వాటికి అధిష్టానం కన్విన్స్ అయ్యిందని..అందులో భాగంగా ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొత్తం మీద ఆరు బెర్తులకు ఆరుగురు పూర్తికావడంతో..మైనారిటీలకు ఛాన్స్ లేదనే టాక్ వస్తుంది. దీంతో మైనారిటీలకు అవకాశం కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఒకరికి ఉద్వాసన పలికి మైనారిటీ కోటాలో అమీర్ అలీఖాన్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది.
మంత్రుల పోర్ట్ ఫోలియోలు కూడా మారుస్తారా?
మంత్రివర్గ విస్తరణతో పాటు పనితీరు ఆధారంగా మంత్రుల పోర్ట్ ఫోలియోలు కూడా మారుస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు సీఎం దగ్గరున్న శాఖలను కేటాయించే విషయంపై కూడా అధిష్టానం దగ్గర చర్చ జరిగిందట. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన దగ్గరున్న శాఖలలో మార్పు చేయాలని కోరుతున్నారట.
తన ఇరిగేషన్ శాఖను మార్చి రెవెన్యూశాఖ ఇవ్వాలని కోరుతున్నారట. రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న పొంగులేటికి..సీఎం దగ్గరున్న అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. ఇరిగేషన్ శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇస్తారని చర్చ జరుగుతోంది. ఇక అమాత్య బెర్తులు కన్ఫామ్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్, వాకిట శ్రీహరి ముదిరాజ్‌లు కూడా ఏయే శాఖలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై తమ సన్నిహితులతో చర్చిస్తున్నారట.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశం తుదిదశకు వచ్చినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. క్లైమాక్స్‌లో ఛాన్స్ కొట్టేసేందుకు కొందరు ట్రై చేస్తుంటే.. మంత్రిగా బెర్త్ కన్ఫామ్ అయినవారు శాఖలపై దృష్టి పెట్టారు. మరోవైపు సీనియర్ మంత్రులు కూడా తమ శాఖలను మార్పులు కోరుతున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నా..కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.