Intermediate Board: విద్యార్థి మానేస్తే ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే.. 8 గంటలు నిద్ర మస్ట్.. ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు మార్గదర్శకాలు జారీ

ఇంటర్ జూనియర్ కళాశాలలో చేరిన తర్వాత విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మానేయాల్సి వస్తే ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థి కట్టిన ఫీజులో కొంతమొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఇంటర్ బోర్డు నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది.

Telangana Intermediate Education

Intermediate Board: తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఫిబ్రవరి నెలలో నార్సింగ్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం విధితమే. దీనికితోడు ఒత్తిడి కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నిరోధానికి ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ విచారణ తరువాత పలు సమీక్షల అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. మొత్తం 16 మార్గదర్శకాలను పేర్కొన్నారు. అన్ని ఇంటర్ కళాశాలలు ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.. కృష్ణా ఫస్ట్, విజయనగరం లాస్ట్

తాజా మార్గదర్శకాల ప్రకారం.. కళాశాలలో చేరిన తర్వాత విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మానేయాల్సి వస్తే ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థి కట్టిన ఫీజును తిరిగి చెల్లించాలని ఇంటర్ బోర్డు నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది. కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ముందుగానే ఫీజు మొత్తం కట్టించుకుంటున్నాయి. దీంతో విద్యార్థి అనారోగ్యం పాలైన, ఇతర కారణాల వల్ల కళాశాలను వీడాల్సి వస్తే ఆ ఫీజును కళాశాలలు తిరిగి చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. విద్యార్థి కళాశాలలో చేరిన మూడు నెలల్లోపు మానేస్తే 75శాతం ఫీజు, ఆ తరువాత మూడు నెలల్లోపు మానేస్తే 50శాతం, ఆరు నెలల అనంతరం మానేస్తే 25శాతం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Inter Weightage Canceled : ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యార్థులు కళాశాల యాజమాన్యం సమకూర్చిన భవనాల్లో (హాస్టల్స్‌లో) ఉంటున్నట్లయితే. వారికి కనీసం 8గంటలు నిద్ర ఉండేలా చూడాలని తాజా మార్గదర్శకాల్లో ఇంటర్ బోర్డు పేర్కొంది. ఉదయం అల్పాహారం తీసుకోవడానికి, ఇతర కాలకృత్యాలకోసం గంటన్నర, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి 45 నిమిషాలు సమయం కేటాయించాలని సూచించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (మధ్యాహ్నం భోజనానికి 45 నిమిషాలు మినహా) కళాశాలల నిర్వహణ ఉండాలని, అయితే, అదనపు తరగతులు కేవలం మూడు గంటలు మాత్రమే నిర్వహించుకోవాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Inter Student Sathwik Case : ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. ఆ నలుగురికి రిమాండ్

ప్రతీయేటా విద్యార్థికి యాజమాన్యాలు రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించాలి. తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలి. వారికి ఆధార్ తో కూడిన బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలి. బోధన సిబ్బందిలో 50శాతం మంది పీజీ చేసిన వారుండాలి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకుంటే విద్యా సంవత్సరం ముగిసే (ఏప్రిల్) వరకు వారిని తొలగించరాదు. ఒకవేళ తీసివేయాలని అనుకుంటే నోటీసు ఇచ్చి ఆ స్థానంలో మరొకరిని నియమించుకోవాలి. ప్రతీ కళాశాలలో సీనియర్ అధ్యాపకుడిని స్టూడెంట్ కౌన్సిలర్ గా నియమించుకోవాలని ఇంటర్ బోర్డు తాజా మార్గదర్శకాల్లో సూచించింది.

Sakshi Vaidya : ఏజెంట్ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా? ఏజెంట్ ఆఫర్ వస్తే స్కామ్ అనుకుందట..

జూనియర్ కళాశాలలో ప్రత్యేక మొబైల్ నెంబర్ కేటాయించుకోవాలి. ఒకవేళ ప్రిన్సిపల్ మారినా అదే నెంబర్ ఉండాలి. ప్రిన్సిపల్ మారిన సమాచారాన్ని డీఐఈవోకు సమాచారం తప్పని సరిగా ఇవ్వాలి. అధ్యాపకులు విద్యార్థులకు రోజూ ఏ పాఠం చెప్పారో టీచింగ్ డైరీల్లో రాయాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్ నిరోధానికి కమిటీ నియమించాలి. అంతేకాక.. తరగతులు జరుగుతున్న సమయంలో క్లాస్ రూంలోకి ఎవరిని అనుమతించొద్దు. ఒకవేళ తల్లిదండ్రులను అనుమతించాలంటే నిర్దేశిత సమయంలోనే అనుమతించాలని ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.