కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకే శిక్షణ కావాలా..? ఏం జరుగుతోంది?

ఇలా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మల్లు రవి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీనే గీత దాటుతోందా.. వివాదాల్ని చక్కదిద్దాల్సిన కమిటీ.. వివాదాల్లో చిక్కుకుంటుందా.. కమిటీ చైర్మన్‌ మల్లురవి.. కాంగ్రెస్‌కు ముల్లులా తయారయ్యారా..? ఫిర్యాదులు తీసుకోవాల్సిన కమిటీ చైర్మన్‌ పైనే కంప్లైంట్స్‌ వస్తున్నాయా..? అసలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో ఏం జరుగుతోంది. కమిటీ చైర్మన్‌ను వరంగల్‌ కాంగ్రెస్ నేతలు ఎందుకు తప్పుబడుతున్నారు. లెట్స్ వాచ్ దిస్

తెలంగాణ కాంగ్రెస్‌కి క్రమశిక్షణ కమిటీ పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు పార్టీలో ఎవరైనా లైన్ దాటినా.. క్రమశిక్షణ కమిటీ ఎంటరై అదుపులోపెట్టేది. ఏ ఇద్దరు నేతలు గొడవపడినా ఇద్దరికీ సర్దిచెప్పి చేతులు కలిపేది. కానీ ఇప్పుడు కొత్త కమిటీ చైర్మన్ వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. వివాదాలకు చెక్ పెట్టాల్సిన కమిటీనే.. నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది. కమిటీ చైర్మన్ మల్లు రవి వరుస వివాదాలను కొని తెచ్చుకుంటున్నారనే టాక్ గాంధీభవన్‌లో వినిపిస్తోంది. తాజాగా వరంగల్ ఎపిసోడ్‌లోనూ కార్నర్ అయ్యారు ఆయన.

క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఎంపీ మల్లు రవి ఏ మూహూర్తన బాధ్యతలు తీసుకున్నారో గానీ నిత్యం ఆయన్ను వివాదాలు వెంటాడుతున్నాయి. బాధ్యతలు తీసుకున్న రోజే హైకమాండ్ నుంచి చివాట్లు తిన్నారట. పార్టీలో కీలకమైన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పోస్ట్‌ దక్కడంతో ఫుల్‌ ఖుషిగా ఫీలైన మల్లు రవి జోరుగా ర్యాలీ తీశారు.

Also Read: Alienware 16 Aurora వచ్చేసింది.. ఈ ల్యాప్‌టాప్‌లో ఏముంది స్పెషల్? తెలిస్తే కొనేస్తారంతే..

పీసీసీ చీఫ్‌ అయిపోయినంత హంగామా చేశారు ఆయన అభిమానులు. ఢిల్లీ నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తూ.. ఓపెన్ టాప్ జీప్‌లో గాంధీభవన్‌ వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ విషయం తెలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్.. ఇంత హంగామా అవసరమా అంటూ సుతిమెత్తగా చీవాట్లు పెట్టారట. ఇప్పటివరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఏ నేత కూడా ఇంత హంగామా చేసిన దాఖలాలు లేవు.

మరో విషయంలో కూడా మల్లురవి హైకమాండ్ దగ్గర మాట పడాల్సి వచ్చిందట. క్రమశిక్షణ కమిటీలో.. పార్టీ నియమావళి తెలిసిన వారిని పెట్టుకోవాల్సింది పోయి.. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారిని సెలక్ట్ చేసుకున్నారనే విమర్శలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవలే వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తిని క్రమశిక్షణ కమిటీలోకి తీసుకున్నారు. ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు పార్టీ నియమ నిబంధనలు ఎలా తెలుస్తాయంటూ క్లాస్ తీసుకున్నారట. ఇలా చార్జ్ తీసుకున్న రోజే రెండు అంశాలపై ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో మాట అనిపించుకున్నారట మల్లురవి.

ప్రతిపక్ష పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకొని.. 
ఈ రెండు ఇష్యూలు అలా ఉండగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అలయ్‌ బలయ్‌ చేసుకుంటూ పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు మల్లు రవి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గద్వాల జిల్లాలో జరిగిన వేడుకల్లో ఎంపీ మల్లురవి పాల్గొన్నారు. వేడుకల తర్వాత అలంపూర్ BRS ఎమ్మెల్యే విజేయుడును తన వాహనంలో ఎక్కించుకొని.. పార్టీ నేత సరితా తిరుపతయ్య ఇంటికి తీసుకెళ్లారు.

అక్కడ ఎమ్మెల్యేకు సన్మానం చేసి ఫొటోకు ఫోజిచ్చారు.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉంటూ.. ప్రతిపక్ష పార్టీ నేతలతో చెట్టా పట్టాలేసుకొని తిరగడం పార్టీలో ఎవరికీ నచ్చలేదట. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా మల్లురవిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇస్తూ మల్లురవి ఓ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది.

తాజాగా మరో వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మధ్యకాలంలో వరంగల్ జిల్లా నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేలుగా విడిపోయి డైలాగ్‌ వార్‌కు తెరతీశారు. ఈ వ్యవహారాన్ని సెట్ రైట్ చేయాల్సిందిగా క్రమశిక్షణ కమిటీని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని డీల్ చేసే విషయంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లురవి వ్యవహరిస్తున్న తీరుపై ఆ జిల్లా నేతలు ఫైర్ అవుతున్నారు.

క్రమశిక్షణ కమిటీ లోప్రొఫైల్‌గా ఉండాల్సి ఉంటుంది. గతంలో క్రమశిక్షణ కమిటీ బాధ్యతలు చూసిన నేతలంతా ఇలాగే వ్యవహరించారు. కానీ మల్లు రవి మాత్రం వరంగల్ ఎపిసోడ్ విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరించారనేది పార్టీ నేతల మాట. వరంగల్‌ వర్గపోరుపై తరచూ మీడియా ముందుకు వచ్చి స్టేట్‌మెంట్స్ ఇచ్చారాయన. ఈ విషయంలో వరంగల్ జిల్లా నేతలు నొచ్చుకున్నారని తెలుస్తోంది.

వరంగల్ వ్యవహారం విషయంలో ఇరువర్గాలను పిలిచి మట్లాడారు మల్లు రవి. మొదట కొండా మురళిని పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత సెకండ్ వెర్షన్ వినడం కోసం ఎమ్మెల్యేలందరినీ గాంధీభవన్ రావాల్సిందిగా ఆదేశించారు. తమ ఆవేదన చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, గంటల సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వచ్చారు. నేతలు వచ్చినప్పుడు కమిటీ చైర్మన్ మల్లురవి కాస్త హడావిడి చేశారని గాంధీభవన్‌ వర్గాలే చర్చించుకుంటున్నాయి.

పార్టీ అంతర్గత వివాదాన్ని పరిష్కరించాల్సింది పోయి.. మీడియాను పిలిచి విజువల్స్ తీసుకోవాలన్నారట. ఈ విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారని తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మీరేం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. సమస్యను పరిష్కరిస్తారా..? లేదంటే మరింత పెంచాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారట. మరోవైపు పదే పదే కమిటీ ముందుకు రావడం అవమానంగా ఉందంటూ సదరు నేతలు ఫైర్ అయ్యారట. క్రమశిక్షణ కమిటీ ఎటువంటి సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారట.

ఇలా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మల్లు రవి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. వరంగల్ ఎపిసోడ్ సైతం అంతా సద్దుమణిగింది అనుకున్న టైంలో.. మల్లు రవి తీరుతో మళ్లీ మొదటికి వచ్చిందని గాంధీభవన్‌లో నేతలు చర్చించుకుంటున్నారు. అందుకే కొండా దంపతులు కావాలో.. ఎమ్మెల్యేలుగా మేము కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారట వరంగల్ ఎమ్మెల్యేలు.. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ వార్‌ను ఆయన ఎలా డీల్ చేస్తారో చూడాలి.