Mla Anirudh Reddy: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతా అని ఆయన అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయని ఆయన చెప్పారు. మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా మినిస్టర్స్, సీఎం అయ్యేది అని అన్నారు.
మీరు బోరు, డ్రైనేజ్ ఇతర పనులు అడుగుతుంటే మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాం తప్ప.. ఏమీ చేయలేకపోతున్నాం అని అనిరుధ్ రెడ్డి అన్నారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానని అనిరుధ్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇంకో రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నేను కూడా సీఎం అభ్యర్థి అవుతా అంటూ హాట్ కామెంట్స్ చేశారాయన. నా పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి అభిప్రాయమే ఉందని అనిరుధ్ రెడ్డి అన్నారు. అనిరుధ్ రెడ్డి అంటే భోళా.. ఏం అడిగినా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అడుగుతాడని సీఎం రేవంత్ అంటుంటారని అనిరుధ్ రెడ్డి చెప్పారు.
మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయని, నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతాను అంటూ.. ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే మంత్రుల మధ్య విబేధాలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. వరుస వివాదాలు కాంగ్రెస్ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడతాయో చూడాలి.
Also Read: సమంత, తమన్నా, రకుల్ పేర్లతో ఓటర్ స్లిప్ లు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ కలకలం.. అధికారులు సీరియస్..