అమెరికా, సింగపూర్ నుంచి సోషల్ మీడియా నడపడం కాదు.. దమ్ముంటే ముందుకు రావాలి: జగ్గారెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీశ్ రావు తిట్లు తింటున్నారని అన్నారు.

విపక్షాలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠాలా తయారైందని అన్నారు.

అధికారం కోల్పోవడంతో కేటీఆర్, హరీశ్ రావుకు పిచ్చిపట్టిందని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని, బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీశ్ రావు తిట్లు తింటున్నారని అన్నారు.

అమెరికా, సింగపూర్ల నుంచి సోషల్ మీడియా నడపడం ఏంటని, దమ్ముంటే ధైర్యంగా ముందుకు రావాలని జగ్గారెడ్డి సవాలు విసిరారు. సమస్యలపై పోరాడితే తప్పులేదని, కానీ, వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తోందని చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలో ఇద్దరు కలెక్టర్లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని.. దీంతో తిట్టానని, తప్పేంటని జగ్గారెడ్డి నిలదీశారు. తాను తిట్టింది గత ప్రభుత్వంలోనని ఇప్పుడు కాదని తెలిపారు. తాను వార్నింగ్ ఇస్తున్నానని, తేడా వస్తే తాట తీస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైటర్స్ అని, బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే తమ సోషల్ మీడియాను రంగంలోకి దింపుతామని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం : సీఎం చంద్రబాబు నాయుడు