Smita Sabharwal: స్మితా సభర్వాల్‌పై ఆరోపణల్లో నిజమెంత? అసలు వివాదమేంటి? పూర్తి వివరాలు

స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిస్‌ వరల్డ్‌ కాంపిటీషన్‌ ఆర్గనైజేషన్‌లో బిజీగా ఉన్నారు.

Smita Sabharwal

సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఓ అద్దె కారు విషయంలో చిక్కుల్లో పడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీఎంవో అదనపు కార్యదర్శిగా పని చేసిన ఆమె.. ఓ కారును అద్దెకు తీసుకొని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ద్వారా బిల్లులు తీసుకున్నట్లు ఆడిట్‌లో తేలింది. 90 నెలల కాలానికి రూ.61 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించారట. అయితే బిల్లులు పెట్టింది ఎవరు.. ఆమోదం తెలిపిందెవరనే దానిపై మాత్రం క్లారిటీ లేదట. ఇప్పుడు కారు రెంట్ విషయంలో స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ వర్సిటీ సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్‌ హయాంలో సీఎంవోలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు.. ఆమె ఇచ్చిన లేఖ ప్రకారం 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు ఓ కారును అద్దెకు తీసుకున్నారు. కారుకు నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కారు అద్దె పేరుతో మెుత్తం 90 నెలలకు గాను రూ.61 లక్షలు తీసుకున్నట్లు ఆడిట్‌ రిపోర్ట్‌లో తేలిందట.

సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న కారు TS 08 EC 6345 నెంబర్ ప్లేట్‌తో ఉంది. ఆ వాహనం ట్యాక్సీ కాకపోవడం… ఎల్లో ప్లేట్ లేకపోవడమే ఇప్పుడు వివాదానికి కారణమౌతోంది. పవన్‌ కుమార్ అనే వ్యక్తి పేరిట ప్రైవేటు వాహనం ఉన్నట్లు ఆడిట్ శాఖ విచారణలో తేలిందని అంటున్నారు.

ఇక్కడే దొరికిపోయారా?
ఇక్కడే స్మితా సబర్వాల్‌ ఇరుక్కుపోయారన్న చర్చ జరుగుతోంది. తనకు కేటాయించింది ట్యాక్సీ ప్లేట్‌ వెహికలా లేక.. నాన్‌ ట్యాక్స్ వెహికల్‌ అని చెక్ చేసుకోకుండా వాడుకోవడం ఆమె చేసిన మిస్టేక్‌గా చెబుతున్నారు. అయితే చాలా మంది అధికారులు తమ సొంత వాహనాలు వాడుకుంటూ..ట్యాక్సీ వెహికల్స్ యూజ్‌ చేస్తున్నట్లు బిల్లులు డ్రా చేస్తుంటారు.

ఇలా స్మితా కూడా చేశారా అన్న చర్చ సాగుతోంది. లేదంటే ట్యాక్సీ కోసం ఏదైనా ట్రావెల్‌ ఎజెన్సీని కోరితే..వారు నాన్‌ ట్యాక్సీ వెహికల్‌ పెట్టి బిల్లులు డ్రా చేశారా అన్నది తేలాల్సి ఉంది. అయితే స్మితా సబర్వాల్ విషయంలో రెండు వైపులా మిస్టేక్‌ జరిగిందంటున్నారు. ట్యాక్స్ వెహికలా కాదా అని క్రాస్ చేయకుండా వాడటం స్మితా సబర్వాల్ మిస్టేక్‌గా చెబుతున్నారు.

సేమ్‌టైమ్‌ ఆ కారు ప్రైవేటు వ్యక్తి పేరు మీద ఉందా.. లేక ఎల్లో ప్లేట్ ట్యాక్స్‌ వెహికలా అన్నది చెక్‌ చేయకుండా యూనివర్సిటీ అధికారులు బిల్లులు ఎలా ఇచ్చారన్నది కూడా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. స్మితా సబర్వాల్ ఆఫీస్‌ నుంచి వాహనం అద్దె రిసిప్టులు రావడంతో వర్సిటీ యాజమాన్యం ప్రతినెలా డబ్బులు చెల్లించిందని చెప్పుకొస్తున్నారు. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై జరిగిన సాధారణ ఆడిట్‌తో ఇదొక్కటే కాకుండా… మరికొన్ని అవకతవకలు కూడా బయటపడ్డట్లు తెలుస్తోంది.

ఆ కారును ఎనిమిదేళ్లు వాడుకున్నారా?
అయితే ఏ పదవిలో ఉన్నా.. ఏ బాధ్యతలు ఇచ్చినా వాటికి వన్నె తీసుకువచ్చే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మిత సబర్వాల్‌పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సీఎంవోకు ప్రత్యేకంగా వాహనాలేం ఉండవని.. ఇతర శాఖల నుంచే సీఎంవో అధికారులకు వాహనాలు కేటాయిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తనకు వాహనం సమకూర్చాలని స్మితా సబర్వాల్‌ కోరగా ఆమె రిక్వెస్ట్‌ ప్రకారం జయశంకర్‌ విశ్వవిద్యాలయం ఓ ఇన్నోవా వాహనం సమకూర్చిందని అంటున్నారు. ఆ కారును స్మితా సబర్వాత్‌తో పాటు ఆమె అధికారుల టీమ్‌ ఎనిమిదేళ్లు వాడుకుందని చెబుతున్నారు.

ఎక్కడా ఉన్నా తన పని తాను చేసుకుంటూ గుర్తింపు పొందుతున్న స్మితా సబర్వాల్‌పై ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉందని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎంవో కార్యదర్శిగా, కీలక పోస్టుల్లో పనిచేసిన ఆమెపై ప్రస్తుతం ప్రభుత్వంలో కొందరు పెద్దలు కుట్రపూరితంగా కుట్రలకు తెరలేపారన్న టాక్ వినిపిస్తోంది.

పర్యాటక శాఖ బాధ్యతల్లో ఉన్న స్మితా సబర్వాల్‌ మిస్‌ వరల్డ్‌ పోటీలను హైదరాబాద్‌కు తీసుకురావడంతో మంచి గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రతిష్ట దిగజార్చాలని..అవినీతి మరకలు అంటించాలని కొందరు నేతలతో పాటు కొందరు బ్యూరోక్రాట్లు కుట్ర పన్నుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అలిగేషన్స్, ఆరోపణలు ఎలా ఉన్నా.. స్మితా సబర్వాల్‌కు జయశంకర్‌ విశ్వ విద్యాలయం నోటీసులు ఇస్తే మాత్రం ఇష్యూ మరింత పెద్దది కానుంది. స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిస్‌ వరల్డ్‌ కాంపిటీషన్‌ ఆర్గనైజేషన్‌లో బిజీగా ఉన్నారు. తన మీద వచ్చిన ఆరోపణలపై ఆమె ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.