Jayashankar Bhupalpally
Jayashankar Bhupalpally : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పుతూ వారు సరియైన మార్గంలో ఉన్నత శిఖరాలు అదిరోహించేలా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు నీచంగా ఆలోచించాడు. పాఠశాల ప్రిన్సిపల్ పై కోపంతో విద్యార్థుల ప్రాణాలకే ముప్పుతెచ్చే పనిచేశాడు. విద్యార్థులు ఉపయోగించే వాటర్ ట్యాంకులో పరుగుల మందు కలిపాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. సదరు టీచర్ తీరుపట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.
Also Read: Crime News Today : కుటుంబంలో చిచ్చు పెట్టిన సీరియల్.. భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఆత్మహత్యాయత్నం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల (యూఆర్ఎస్)లో శుక్రవారం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం ఉదయం టిఫిన్ సమయంలో పాఠశాలలోని కలుషిత నీరు తాగి 13మంది విద్యార్థులు, ఓ టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
కలుషితమైన నీటి వల్ల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని జరిగిన విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఇబ్బంది లేదని వైద్యులు తెలియజేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాలలోని ఆర్వోప్లాంట్ కు సంబంధించిన కెమికల్స్ ద్వారా తాగునీరు ఏమైనా కలుషితమైందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు డీఎంహెచ్ఓ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. తాగునీటిని ఓ బాటిల్ లో శాంపిల్ తీసి పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపించారు.
అయితే, ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాల ప్రిన్సిపల్ వెంకటనర్సయ్యపై కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో ఉపాధ్యాయుడు రాజేందర్ పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. విషయం తెలుసుకొని రెసిడెన్షియల్ పాఠశాల వద్దకు చేరుకున్న అధికారులు జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజేందర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.