JP Nadda
Jagat Prakash Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఆదివారం హైదరాబాద్ రానున్నారు. రీజినల్ కన్సల్టెటివ్ (Regional Consultative) పేరుతో పదకొండు రాష్ట్రాల అధ్యక్షులు , ముఖ్యనేతల సమావేశంలో నడ్డా పాల్గొంటారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గోనున్న జేపీ నడ్డా.. ఉదయం 10.20 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్వాగతం పలకనున్నారు.
రీజినల్ కన్సల్టెటివ్ పేరుతో 11 రాష్ట్రాల అధ్యక్షుల సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికలకు ముందే తెలంగాణలో ఎన్నికలు ఉండడంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలే టార్గెట్‌గా బీజేపీ అధ్యక్షుల సమావేశం జరగనుంది. తాజా మీటింగ్ కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
బీజేపీ అగ్రనాయకత్వం హైదరాబాద్ తరలివస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నాయకులను, ఇతరులను రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి ఆదివారం అనుమతించబోమని కార్యాలయ వర్గాలు తెలిపాయి. జేపీ నడ్డా, దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం రాత్రి అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి తరుణ్ ఛుగ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాల ఎజెండాపై సమీక్షించారు.