×
Ad

Jubilee hills by election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు.. ప్రచారానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్..? ఆ ఓటర్లే టార్గెట్

Jubilee Hills by election జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు.

Jubilee hills by election : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలిచారు. ఇక బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నవీన్ యాదవ్ విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంను షురూ చేయగా.. ఇప్పటికే మంత్రులు గల్లీగల్లీ తిరుగుతున్నారు. మాగంటి సునీత గెలుపు బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచారపర్వంలోకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అడుగుపెట్టనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఆ మూడు పార్టీలతో ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించే యోచనలో తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు సమాచారం. పార్టీ కీలక నేతల బృందాన్ని అమరావతి పంపించి ఇద్దరు అగ్రనేతలను ప్రచారానికి రమ్మని ఆహ్వానించాలా..? లేక.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాకు విషయం చెప్పి వారి ద్వారా ఎన్నికల ప్రచారంకు ఆహ్వానం అందించాలా అనే విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Chandrababu : ఆ కారును చూసి మురిసిపోయిన చంద్రబాబు.. ‘నా పాత మిత్రుడు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్.. లండన్‌కు సీఎం దంపతులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు. మూడు లక్షల మంది ఓటర్లలో సీమాంధ్ర ఓటర్లు లక్షన్నరకుపైగానే ఉన్నారని, ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ముస్లీం మైనార్టీ వర్గాల తరువాత అత్యధికంగా ఉన్నారని బీజేపీ అంచనా వేసింది. అంతేకాదు.. సినీరంగం ఓట్లు 30వేలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25వేల మందికిపైగా ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే చంద్రబాబు, పవన్ ఇద్దరు అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.

ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌తోపాటు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన వారు.. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువే. ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు తిప్పికోవాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేవలం ఒక నియోజకవర్గంలో ఎన్నిక కోసం చంద్రబాబు, పవన్ ప్రచారానికి వచ్చే పరిస్థితి ఉండదన్న వాదన కూడా ఉంది. ఒకవేళ ఆ ఇద్దరూ జూబ్లీహిల్స్ ప్రచార పర్వంలోకి అడుగుపెడితే బీజేపీ బలం అనూహ్యంగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుండగా.. 9వ తేదీ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ప్రచారం ముగిసే రెండు, మూడు రోజుల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తే పార్టీలో జోష్ వస్తుందని, తద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వవచ్చుననే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం.