×
Ad

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. టీడీపీ పోటీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు పార్టీ నేతలతో సమావేశం.. దిశానిర్దేశం

Jubilee Hills Bypoll అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని వివిధ జిల్లాల టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.

Chandrababu Naidu

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. గత ఎన్నిల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.

ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. దీంతో ఆమె ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. బీసీ వ్యక్తిని బరిలోకి దింపుతామని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. రెండు రోజుల్లో అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది. మరోవైపు బీజేపీ ఉప ఎన్నిక పోరులో సత్తాచాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ మూడు పార్టీలతో పాటు టీడీపీ కూడా పోటీలో ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, ఈ అంశంపై చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలు మంగళవారం రాత్రి భేటీ అయ్యారు.

Also Read: Mohan Babu: మంచు మోహన్ బాబుకు బిగ్‌షాక్.. యూనివర్సిటీకి భారీ జరిమానా.. ఆ మొత్తం చెల్లించాల్సిందే..

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వెళ్లిన నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి వరకు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.

తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య ఏపీలో పొత్తు ఉన్నందున.. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లలేమని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ మద్దతు అడిగితే కలిసి పనిచేయాలని, లేదంటే తటస్థంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల అభిమానం ఉందని, జనంలో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని సమావేశంలో చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయించారు.