Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రచార గడువు దగ్గరపడుతుండటంతో పాటు..పోలింగ్ డేట్ ముంచుకొస్తున్నా కొద్దీ..పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్‌లో అన్ని ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ, జనసేనలు ఎన్డీఏ కూటమిలో ఉండటంతో బీజేపీ సపోర్ట్ తమ అభ్యర్థికేనన్నది కమలనాథుల అంచనా.
అయితే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కూడా కమ్మ ఓటర్లపై గట్టిగానే గురి పెట్టాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఉన్న టీడీపీ సానుభూతి పరులు, కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు 22వేల కమ్మ ఓటర్లపై ఎవరికి వాళ్లే లెక్కలు వేసుకుంటున్నాయి.
టీడీపీ సానుభూతి పరుతలతో పాటు, కమ్మ ఓటర్లు తమకే మద్దతు ఇస్తారని బీజేపీ చెప్పుకుంటోంది. అటు చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు సన్నిహితులు కావడంతో కమ్మం సామాజికవర్గం ఓటర్లతో పాటు టీడీపీ ఓట్లు కూడా తమకే పోలరైజ్ అవుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు ఆ రెండు పార్టీలు టీడీపీ, కమ్మ వర్గం ఓటర్ల కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read: YSRCP: గ్రూప్‌వార్‌కు చెక్.. కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆమె ఫైనలా..?
మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయింది. ఆయన ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో పనిచేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన గోపినాథ్..మొదటిసారి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగానే గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ..టీడీపీ సానుభూతిపరులు, కమ్మ ఓటర్లు మాగంటి గోపినాథ్‌కు ఆయన వెంటే నడిచారు.
మాగంటి గోపీనాథ్ మూడుసార్లు జూబ్లీహిల్స్ నుంచి గెలవడానికి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు, కమ్మ సామాజికవర్గం మద్దతు కీలకంగా చెబుతున్నారు. మాగంటి గోపినాథ్‌ది కూడా కమ్మ సామాజికవర్గమే కావడంతో.. టీడీపీ సానుభూతి పరులు, కమ్మ ఓటర్లు తమవైపే ఉంటారని బీఆర్‌ఎస్ భావిస్తోంది. వాళ్లంతా మాగంటి గోపినాథ్‌కు మద్దతుగా నిలిచినట్లేగానే..సునీతమ్మకు అండగా నిలుస్తారన్న అంచనాల్లో కారు పార్టీ లీడర్లు ఉన్నారట.
22వేల మంది కమ్మం సామాజికవర్గం ఓటర్లు
జూబ్లీహిల్స్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా..దాదాపు 22వేల మంది కమ్మం సామాజికవర్గం ఓటర్లు ఉన్నారని..వాళ్లను ఆకర్శించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తరఫున కమ్మ నేతలతో టచ్‌లోకి వెళ్లి తమవైపు తిప్పుకునేందుకు చక్రం తిప్పారట. ఆ తర్వాత నేతలంతా సీఎంను కలిశారు.
ఆ సందర్భంలోనే అమీర్‌పేటలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కమ్మ నేతలు కోరినట్టు టాక్. ఈ నేపథ్యంలో రోడ్‌షోలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కమ్మ నేతలంతా తెలుగుదేశం పార్టీని తమ ఇంటి పార్టీగా చెప్పుకుంటారు. తెలంగాణలోనూ కమ్మ ఓటర్లు టీడీపీగా మద్దతుగా నిలుస్తుంటారు.
అయితే కమ్మ నేతలంతా సీఎం రేవంత్‌ను కలవడంతో..బీఆర్‌ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతమధుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. దాంతో ఇద్దరు నాయకులు కమ్మ సామాజికవర్గం నాయకులకు టచ్‌లోకి వెళ్లారట. ఇలా కమ్మ ఓటర్ల మద్దతుపై ఎవరికి అంచనాలు..ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. టీడీపీ సానుభూతి పరులు, కమ్మ ఓటర్లు ఎటువైపు మోగ్గుచూపారో తెలియాలంటే మాత్రం ఈనెల 14వరకు వెయిట్ చేయాల్సిందే.