Jubilee Hills Car Accident
JubileeHills Car Accident Victims: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 యాక్సిడెంట్ బాధిత కుటుంబం 10 టీవీతో మాట్లాడింది. అసలేం జరిగిందో వివరించింది. నిన్న(మార్చి 17) రాత్రి సరిగ్గా 8గంటల 40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. రోడ్డు దాటుతుండగా నల్లని కారు తమని ఢీకొట్టిందన్నారు. కారులో డ్రైవర్ ఒకరే ఉన్నారని వారి చెప్పారు. సుష్మా, అనిల్, అర్చన, సాగరిక, కాజోల్, సాగర్.. తామంతా రోడ్డు దాటుతున్నామని, ఇంతలోనే వేగంగా వచ్చిన కారు తమను ఢీకొట్టిందన్నారు.(JubileeHills Car Accident Victims)
ఈ ప్రమాదంలో తాము తమ కొడుకును కోల్పోయామని కన్నీటిపర్యంతం అయ్యారు. తాము గాయపడ్డామని చెప్పారు. నిన్న రాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించారని, ఇప్పుడు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నామని తెలిపారు. తాము అందరం మహారాష్ట్ర వెళ్లిపోతున్నామని చెప్పారు. తమ కొడుకు అంత్యక్రియలు మహారాష్ట్రలోనే జరుపుతామన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరింది.(JubileeHills Car Accident Victims)
MLA Shakeel : ఆ కారు ఎమ్మెల్యే షకీల్‌దే ?.. పోలీసుల అనుమానాలు
జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఎమ్మెల్యే షకీల్‌దేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. మీర్జా ఇన్‌ఫ్రాలో బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉన్న ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు తనది కాదని గురువారం షకీల్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టిక్కర్ వేరే ఫ్రెండ్‌కు ఇచ్చానన్నారు. అయితే ఇప్పుడు కారు షకీల్‌దేనని దాదాపుగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. మీర్జా, అతడి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.(Jubilee Hills Car Accident Victims)
అసలేం జరిగింది ?
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి బలైంది. దుర్గంచెరువు నుంచి వేగంగా వస్తున్న కారు.. రోడ్ నంబర్ 45 డివైడర్‌ను ఎక్కి చెట్టును ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న బెలూన్స్ అమ్ముకునే అభాగ్యులపైకి దూసుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులను మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు బీభత్సం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. బాధితులు 20 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారంటే కారు ఎంత వేగంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బాధితులు పైసాపైసా కూడబెట్డుకున్న డబ్బుతో పాటు వారి సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోయాయి.
కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అనుచరుడు మీర్జా నడిపినట్లు తెలుస్తోంది. కానీ రిజిస్ట్రేన్ మాత్రం ఇన్‌ఫ్రా కంపెనీ పేరుతో ఉంది. ఘటన జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. కారుకు ఎమ్మెల్యే స్టికర్ ఎలా వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేకి రెండు స్టికర్లు మాత్రమే ఇస్తారు. కానీ ఈ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చింది? ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తన ఫ్రెండ్స్‌కు కారు స్టిక్కర్ ఇచ్చినట్టు తొలుత చెప్పారు. ప్రమాదం చేసిన కారు ఆ ఫ్రెండ్స్‌దేనా.. ప్రమాదం తర్వాత పరారైన మీర్జా ఎమ్మెల్యే స్నేహితుడేనా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పరారీలో ఉన్న మీర్జా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను పట్టుబడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగి కారు నడిపారా.. లేక ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.