K Kavitha (Image Credit To Original Source)
K Kavitha: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. శాసనమండలిలో ప్రసంగించిన కవిత..ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నా..శక్తిగా తిరిగి చట్టసభల్లో అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్లారు. అసెంబ్లీ ముందున్న గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు.
మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ద్వారానే పోటీ చేస్తామని కవిత చెబుతూ వస్తున్నారు. తాను పెట్టబోయే పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తానని కవిత ప్రకటించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు ఆలస్యం అవుతుండటంతో..ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కవిత.
Also Read: తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా? మరో రెండు, మూడ్రోజుల్లో..
బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారమె. మాజీ సీఎం జయలలితను గుర్తు చేసేలా..ఏకంగా కట్టు, బొట్టు అంతా లుక్‌నే మార్చేసి..జిల్లాల టూర్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ కవిత ముందుకెళ్తున్నారు.
సొంత రాజకీయ పార్టీపై కవిత కసరత్తు
ఇక ఇప్పుడు సొంత రాజకీయ పార్టీపై కవిత కసరత్తును వేగవంతం చేశారు. మెజార్టీ నేతలు తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరికొందరు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో టీఆర్ఎస్ వచ్చేలా చూడాలని కవితను కోరినట్టు సమాచారం. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన నేపథ్యంలో..పాత టీఆర్ఎస్‌ను కొత్త పార్టీలో ఉండేలా చూడాలని సూచించారట. అందరి అభిప్రాయాలు తీసుకున్న కవిత..మార్చిలోనే కొత్త రాజకీయపార్టీని ప్రకటించనున్నట్లు జాగృతి వర్గాల టాక్.
ఇప్పటికే జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో మెజార్టీ జిల్లాలను చుట్టేసిన కవిత.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెలాఖరులో మంచిర్యాలలో పెద్దఎత్తున జనం బాట ముగింపు సభను నిర్వహించాలని కవిత నిర్ణయించారు.
మంచిర్యాల సభలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాలా, లేదంటే హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర ప్రకటించాలా అన్నదానిపై ఇంకా ఓ డెసిషన్‌కు రాలేదంటున్నారు. మార్చిలో రాజకీయ పార్టీ ప్రకటించిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కవిత భావిస్తున్నారట. పాదయాత్రపై ఇప్పటికే కుటుంబ సభ్యులు, జాగృతి ముఖ్యనేతలతో చర్చించారట.
పాదయాత్ర రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా మెజార్టీ అసెంబ్లీ స్థానాలను చుట్టివచ్చేలా పాదయాత్ర రోడ్ మ్యాప్‌ను రెడీ చేస్తున్నారట కవిత. దీంతో కవిత రాజకీయ పార్టీపై పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాదు సామాన్య జనంలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.