KA Paul
Assembly Elections 2023: విశాఖ పట్నంలో తాను ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఎవరూ బరిలో నిలవబోమని అంటున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కంటే తానే బెటర్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు.
తెలంగాణ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలన్నా తననే గెలిపించాలని కేఏ పాల్ కోరారు. సర్వేలు అన్నీ ప్రజాశాంతి పార్టీ అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. పాలకులుగా గజ దొంగలు ఉండాలా? తాను ఉండాలా? అన్న విషయాన్ని ప్రజలు నిర్ణయించాలని కోరారు. తాను ఏపీ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేశానని తెలిపారు.
తెలంగాణలో తాను త్వరలోనే 119 మంది అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారు. టికెట్లను ఇతర పార్టీల్లో అడుక్కోవద్దని, నేతలు ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. వచ్చిన వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 119 నియోజక వర్గాల టికెట్ల కోసం 3600 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
ఆసక్తి ఉన్నవారు టికెట్లు కావాలని అనుకున్న వారు అందరూ రూ.10 వేలు పంపాలని ఆయన సూచించారు. జగన్ చేసిన తప్పులను షర్మిల చేయొద్దని, అలాగే, విజయమ్మ పోటీ చేయొద్దని ఆయన కోరారు. మాయావతి బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే బీఎస్పీ అభ్యర్థులను నిలబెడుతోందని చెప్పారు.