Kaleshwaram Commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు ఇవాళ హాజరు కానున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను కమిషన్ విచారించింది. అయితే, ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లకు విచారణకు రావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఈ నెల 5న హాజరు కావాల్సి ఉంది. అయితే, 11న విచారణకు హాజరవుతానని, ఎంక్వైరీ తేదీని మార్చాలని కమిషన్‌కు ఆయన విజ్ఞప్తి చేయడంతో.. కమిషన్ కేసీఆర్ విచారణనను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.
ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని ఈటల చెప్పారు. అయితే, ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరు కానున్నారు.
హరీశ్ రావు రెండు రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవాళ హరీశ్ రావు విచారణ తరువాత ఎల్లుండి కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కానున్నారు. హరీశ్‌రావు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్ఠం చేశారు.