గంటన్నర పాటు ఈటలను విచారించిన కాళేశ్వరం కమిషన్.. పలు అంశాలపై ప్రశ్నల వర్షం.. విచారణ సాగింది ఇలా.. ప్రశ్న, సమాధానం.. పూర్తి వివరాలు

మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గంటలన్నర పాటు విచారణ కొనసాగింది.

గంటన్నర పాటు ఈటలను విచారించిన కాళేశ్వరం కమిషన్.. పలు అంశాలపై ప్రశ్నల వర్షం.. విచారణ సాగింది ఇలా.. ప్రశ్న, సమాధానం.. పూర్తి వివరాలు

Updated On : June 6, 2025 / 1:18 PM IST

Kaleshwaram Commission: మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఆయన హాజరయ్యారు. అయితే, తొలుత ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్ తో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేయించిన కమిషన్.. ఆ తరువాత ఆయన్ను 19 ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ పలు అంశాలకు సంబంధించి ఈటలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు గంటన్నర పాటు కాళేశ్వరం కమిషన్ ఈటలను విచారించింది.

 

ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు..? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ఈటలను ప్రశ్నించింది. టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటల చెప్పారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టారని ఈటల బదులిచ్చారు. తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదన్న ఈటల.. మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో ఎత్తు 150 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించారని వెల్లడించారు.

 

విచారణ ఇలా సాగింది.
కాళేశ్వరం కమిషన్ : మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు
ఈటల రాజేందర్ : క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తర్వాతే నిర్మాణం జరిగింది.
కమిషన్ : రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు.
ఈటల రాజేందర్ : మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. హరీశ్ రావు చైర్మన్ గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాము. ఎక్స్‌పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది.
కమిషన్: రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా..?
ఈటల రాజేందర్ : రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది.
కమిషన్ : మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం ఎవరిది..? మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా ?
ఈటల రాజేందర్ : టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చాయి. ఫైనల్ గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది.
కమిషన్ : డీపీఆర్ కోసం 597. 45 లక్షలు వ్యాప్కోన్ సంస్థ కు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా?
ఈటల రాజేందర్ : తెలియదు.
కమిషన్ : డీపీఆర్ అప్రూవల్ క్యాబినెట్ లో జరిగిందా?

ఈటల రాజేందర్ : అన్ని అనుమతులు క్యాబినెట్లో తీసుకున్నాం.
కమిషన్ : కాలేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు?
ఈటల రాజేందర్ : నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్సు పరిధిలోకి కార్పొరేషన్ రాదన్న ఈటల.
కమిషన్ : లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలి అనుకున్నారు.
ఈటల రాజేందర్ : కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీ పెమెంట్ చేయాలని అనుకున్నాం. కానీ, కార్పొరేషన్ ద్వారా నిధుల కలెక్షన్ కాలేదు.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆఫ్ బడ్జెట్ లో జరిగిందా..?
ఈటల రాజేందర్ : నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు.
కమిషన్ : మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు..?
ఈటల రాజేందర్ : ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్నా టెక్నికల్ టీం చెప్తుంది.
కమిషన్ : ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే..?
ఈటల రాజేందర్ : అదంతా ఫైనాన్సు శాఖ కిందికి రాదు. ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది.