BRS: గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..

ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నేతలకు మరో ఆఫర్‌ కూడా ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం సందర్శనకు..

CM Revanth Reddy

తెలంగాణలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య నీటి యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింత నుంచి కాళేశ్వరం వరకు కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల అంశంపై నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేసింది బీఆర్‌ఎస్‌. దానికి కౌంటర్‌గా అదే రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో నీళ్ల పంచాయితీ రాజ‌కీయంగా సెగ‌లు రేపుతోంది. ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింత తప్పు మీదంటే మీదేనంటూ కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఒకరి తప్పును ఒకరు ఎత్తిచూపుకునేందుకు వ్యూహాలు సైతం రచిస్తున్నారు. ఇందులో భాగంగా గులాబీ పార్టీ చీఫ్‌ కేసీఆర్‌.. నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తే.. దానికి ఒకరోజు ముందుగానే అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు.. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమైంది రేవంత్‌ సర్కారు.

దాని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం: బీఆర్ఎస్
కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించిందని.. దాని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టమని ఆరోపిస్తోంది బీఆర్‌ఎస్‌. కానీ.. ఈ నిర్ణయం తీసుకున్నదే గత ప్రభుత్వమని.. తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా ఈనెల 13న నల్గొండ వేదికగా బహిరంగ సభ నిర్వహించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైంది.

అయితే.. బీఆర్‌ఎస్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధమైన రేవంత్‌రెడ్డి సర్కారు.. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 12న అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్‌. ఇందులో భాగంగా ఈనెల 13న రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ రోజు ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రకటించారు ముఖ్యమంత్రి.

సభకు ప్లాన్‌ చేసిన రోజునే..
బహిరంగ సభకు ప్లాన్‌ చేసిన రోజునే.. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టడం ద్వారా బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేసింది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పుడు ముందుగా నిర్ణయించినట్లుగా సభ నిర్వహించాలా ? లేక కాళేశ్వరం సందర్శనకు వెళ్లాలా ? అన్నది గులాబీ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నేతలకు మరో ఆఫర్‌ కూడా ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం సందర్శనకు వేరే తేదీ చెప్పినా ఓకేనని ప్రకటించారాయన. ఒకరోజు అటూఇటూ అయినా సరే.. ప్రజాప్రతినిధులంతా ప్రాజెక్టును సందర్శించాలన్నారాయన.

మరి సీఎం రేవంత్‌రెడ్డికి పిలుపునకు బీఆర్‌ఎస్‌ ఎలా స్పందించనుంది ? ఈనెల 13నే ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తారా ? లేక మరో తేదీకి వాయిదా వేయాలని కోరతారా ? అన్నది చర్చనీయాశంగా మారింది. మొత్తంగా ఇరు పార్టీల మధ్య మొదలైన నీటి వివాదం కాస్తా తారస్థాయికి చేరింది. చివరకు దీనికి పుల్‌స్టాప్‌ ఎక్కడ పడుతుందనేది వేచి చూడాల్సిందే.


Prudhvi Raj: మంత్రి రోజాపై సినీనటుడు పృథ్వీరాజ్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు