Kalvakuntla Kavitha: సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం.. వారసత్వ ఉద్యోగాల్లో వంచన.. మందమర్రి వేదికగా కవిత ఆగ్రహం!
సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- V Santhosh Kumar
- Published on- June 15, 2026 / 02:36 PM IST
kalvakuntla Kavitha demands medical board and job security at Singareni round table
- వారసత్వ ఉద్యోగాల్లో కార్మికులకు అన్యాయం
- సింగరేణిని ప్రైవేటీకరించడానికి కుట్రలు
- భూగర్భ గనుల రక్షణ కోసం పోరాడుతాం.
Kalvakuntla Kavitha: సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధిలోని కాసిపేట గనిపై నిర్వహించిన ‘బొగ్గుబాయి’ బాట గేట్ మీటింగ్‌లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్న పాలకుల తీరుపై ఆమె మండిపడ్డారు. సింగరేణి సంస్థ మనుగడను, కార్మికుల ప్రయోజనాలను కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
సంస్థ పరిరక్షణ కోసం టీఆర్‌ఎస్, హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్) కలిసికట్టుగా ముందడుగు వేస్తున్నాయని కవిత(Kalvakuntla Kavitha) వెల్లడించారు. కార్మికులకు అనుకూలంగా విధానాలు, పాలసీలను రూపొందించాల్సిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులే స్వయంగా అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ కార్మిక రంగాన్ని పూర్తిగా మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు కార్మికులను మోసం చేసేలా ఉందే తప్ప, వారి సమస్యలను పరిష్కరించేలా లేదని విమర్శించారు.
సింగరేణి సంస్థకు ఉన్న ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి, దానిని ప్రైవేటీకరించడానికి తెరవెనుక పెద్ద కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. లాభసాటిగా ఉన్న అండర్ గ్రౌండ్ మైన్లను (భూగర్భ గనులను) ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం హెచ్‌ఎంఎస్ అనుబంధ కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ప్రకటించారు. కార్మికుల హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
